సిరిసిల్ల న్యూస్:
ఎన్నికల కోడ్ లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల్లో అనుమానిత నగదు లావాదేవీలపై అధికారులు దృష్టి సారించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి బ్యాంక్ అధికారులకు సూచించారు. ఖాతాల్లో భారీగా నగదు జమ, విత్ డ్రా ల సమాచారాన్ని ఎన్నికల అకౌంటింగ్ నోడల్ ఆఫీసర్ రోజువారీ నివేదిక అందజేయాలని అన్నారు. బ్యాంకుల కో ఆర్డినేటర్ లతో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏటీఎం లలో నగదు డిపాజిట్ చేయడానికి వినియోగించే వాహనాలకు ఆయా బ్యాంకులు తప్పనిసరిగా జీపీఎస్ ను ఏర్పాటు చేసి వాహనాలను పరిశీలించాలని తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించి ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలని, బ్యాంకు అధికారులు తరలిస్తున్న నగదుకు తప్పనిసరిగా డాక్యుమెంట్లు, క్యూఆర్ కోడ్ ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అభ్యర్థి, అభ్యర్థి సంబంధీకుల అకౌంట్ల నగదు లావాదేవీలను అందించాలని తెలిపారు.

ఎవరైనా బ్యాంకు ఖాతాలో ప్రతీ రోజు లక్ష రూపాయలు డిపాజిట్ చేసినా, విత్ డ్రా చేసినా, నెలలో రూ.10 లక్షలు పైబడి నగదు డ్రా చేసినా, బదిలీ చేసినా ప్రతీ రోజు ఆయా బ్యాంకుల అధికారులు ఎన్నికల అధికారులకు సమాచారం అందించాలని సూచిం చారు. ఆన్లైన్లో జరిగే లావాదేవీలపై గట్టి నిఘా పెట్టాలని కోరారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు ఒకే అకౌంట్ , వివిధ అకౌంట్లకు యూపీఐ ద్వారా గూగుల్ పే, ఫోన్ పే ఇతర యాప్ ద్వారా డబ్బులు జమ చేసినచో వాటి వివరాలను కూడా పంపించాలని బ్యాంకర్లను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా లీడ్ బ్యాంక్ అధికారి టిఎన్ మల్లికార్జున్ రావు, ఎక్స్పెండిచర్ నోడల్ అధికారి రామకృష్ణ, జిల్లా ఆడిట్ అధికారిని స్వప్న, ఐటీ నోడల్ అధికారి మహమ్మద్ రఫీ, జిల్లాలోని అన్ని బ్యాంకుల కో ఆర్డినేటర్ లు పాల్గొన్నారు.