ఎన్నారై పాలసీ సాధన కోసం సిరిసిల్ల వేదికగా అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తాం- గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక కన్వీనర్ దొనికిని కృష్ణ
సిరిసిల్ల న్యూస్:
ఎన్నారై పాలసీ సాధన కోసం, గల్ఫ్ కార్మికుల తరపున అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయడానికి సిద్ధం అన్నారు గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక కన్వీనర్ దొనికిని కృష్ణ. సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో దొనికిని కృష్ణ మాట్లాడుతూ గత 8 సంవత్సరాల నుండి గల్ఫ్ కార్మికులను ఐక్యం చేస్తూ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాం అన్నారు. 2008 సంవత్సరంలో ఒక సభ లో కేసీఆర్ మాట్లాడుతూ ఎన్నారై పాలసీ ఏర్పాటు చేయాలని, చనిపోయిన గల్ఫ్ కుటుంబాలకు ఐదు లక్షల ఎక్సగ్రేషియా ఇవ్వాలని అన్నారని అన్నారు. 2014 తరవాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక గల్ఫ్ కార్మికులుగా మా సమస్యలు తీరుతాయని చాలా సంతోష పడ్డాం, కానీ ఇప్పటివరకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ గాని గల్ఫ్ కార్మికులకు చేసింది ఏమి లేదు అన్నారు. 2016 లో కేటీఆర్ మీటింగ్ పెట్టి ఎన్నారై పాలసీ ఇవ్వాలని, ఎన్నారై పాలసీ ముసాయిదా తయారు చేసి గల్ఫ్ కార్మికులను ఆదుకుంటాం అని అన్నారు, కాని ఇప్పటివరకు గల్ఫ్ కార్మికుల కొరకు ఏమి చేశారని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత గల్ఫ్ దేశాల నుండి ఇప్పటి వరకు 2000 మంది మృతదేహాలు మన దేశానికి వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులు ఏజెంట్ మోసాలకు గురి కాకుండా చూడాలని, చనిపోయిన కార్మికుల కుటుంబాలకు అండగా ఉండాలని, ఏ దేశాలకు కార్మికులు వెళితే వారికి భవిష్యత్ ఉంటుందో గైడెన్స్ ఇప్పించి గల్ఫ్ కార్మికులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం తప్ప మాకు వేరే ఉదేశ్యం లేదు అన్నారు. మిడ్ మానేరు, మల్కపేట్ రిజర్వాయర్, అనంతగిరి రిజర్వాయర్ నిర్మాణాలు పూర్తయి ప్రతి గ్రామానికి నీళ్లు వచ్చాక, తెలంగాణ అభివృద్ధి చెందాక ఇప్పటికి కార్మికులు ఎందుకు గల్ఫ్ వెళ్తున్నారని ప్రశ్నించారు. గల్ఫ్ కార్మికులకు న్యాయం చేయడానికి, ఎన్నారై పాలసీ సాధించడానికి సిరిసిల్ల వేదికగా కేటీఆర్ మీద పోటీ చేస్తున్నాం అన్నారు. ఎన్నారై పాలసీ సాధన కోసం, గల్ఫ్ కార్మికుల కొరకు చనిపోవడానికి కూడా సిద్ధం అన్నారు దొనికిని కృష్ణ. ఈ ప్రెస్ మీట్ లో వివిధ గ్రామాల నుండి వచ్చిన గల్ఫ్ కార్మికులు పాల్గొన్నారు.