దేశ వ్యాప్తంగా గత రెండు నెలలుగా వైరల్ ఫీవర్స్ విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా డెంగ్యూ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. దోమకాటుతో వచ్చే ఈ వైరల్ వ్యాధిని ప్రారంభంలో గుర్తించి, సరైన చికిత్స అందిస్తే ప్రమాదం ఉండదు. లేదంటే వ్యాధి ముదిరి ప్రాణాలకే ప్రమాదంగా మారవచ్చు. అందుకే వైరల్ ఫీవర్ లక్షణాలు ఉంటే కచ్చితంగా వైద్యుల సలహాతో డెంగీ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. అయితే ఈ వ్యాధి తీవ్రతను తగ్గించే మార్గాలను ఆయుర్వేదం సూచిస్తుంది అవేంటో తెలుసుకుందాం.
సాధారణంగా డెంగ్యూకు చికిత్సగా కొన్ని రకాల యాంటీబయాటిక్స్, మందులు ఇస్తారు. అయితే కొన్ని రకాల నేచురల్ రెమిడీస్‌ను కూడా ఇందుకు ఉపయోగించవచ్చు. దీనివల్ల కెమికల్స్‌తో తయారు చేసే మెడిసిన్ల సైడ్ ఎఫెక్ట్స్ ప్రభావం తప్పుతుంది. ముఖ్యంగా కొన్ని రకాల సహజ పదార్ధాలు ఆయుర్వేదం పరంగా ఇమ్యూనిటీ బూస్టర్‌గా పనిచేస్తాయి. వీటితో చేసే చికిత్సలు డెంగ్యూ వంటి వ్యాధుల నివారణకు మాత్రమే కాకుండా, వీటి నివారణకు పోరాడటానికి రోగనిరోధక శక్తిని సైతం పెంచగలవు.
సాధారణంగా ఆయుర్వేదంలో శరీరానికి అవసరమైన పోషకాహారాలను అందిస్తూ, వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తారు. డెంగ్యూకి కూడా ఇదే రకమైన చికిత్స విధానం వర్తిస్తుంది. ఈ వైద్య ప్రక్రియలో శరీరంపై అదనపు ఒత్తిడి లేకుండా సమస్యలు దూరం చేసుకోవచ్చు. ఎవరైనా డెంగ్యూ బారిన పడితే, కొన్ని ఆయుర్వేద పదార్థాలు, నివారణలను వైద్యులు సిఫార్సు చేస్తారు. ఇవి రోగి వేగంగా కోలుకోవడానికి సహాయపడతాయి. ఈ లిస్టులో ఉన్న పదార్థాలు ఏవో చూద్దాం.
- విటమిన్ సి
విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. సిట్రస్ జాతి పండ్లలో ఇది పుష్కలంగా లభిస్తుంది. ఉసిరి రసం, ఉసిరి పండు, ఆరెంజ్ జ్యూస్ వంటివి ఈ పోషకాలు లభించే వనరులు. అందుకే డెంగ్యూతో బాధపడేవారికి ఈ సహజ పదార్థాలను ఆయుర్వేద వైద్యులు సిఫార్సు చేస్తారు.
- బొప్పాయి ఆకులు
డెంగ్యూ జ్వరం నుండి కోలుకోవడానికి ఎలాంటి ట్రీట్‌మెంట్ తీసుకున్నా సరే, బొప్పాయి పండ్లు తినాలని, ఈ చెట్ల ఆకుల రసం తాగాలని చాలామంది సిఫార్సు చేస్తుంటారు. బొప్పాయి ఆకుల రసం తాగితే, డెంగ్యూ కారణంగా పడిపోయిన ప్లేట్‌లెట్స్ సంఖ్య పెరుగుతుంది.
- కొబ్బరి నీరు
ఒకరికి అధిక జ్వరం వచ్చినప్పుడు, బలహీనతతో బాధపడుతున్నప్పుడు, శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచాలి. ఎందుకంటే డీహైడ్రేషన్‌తో సమస్య మరింత పెద్దదిగా మారుతుంది. అందుకే ఎనర్జీ లెవెల్స్‌ని పెంచడానికి కొబ్బరి నీళ్లను ఆయుర్వేద నిపుణులు ఎక్కువగా సిఫార్సు చేస్తారు.
- వేప ఆకులు
ఆయుర్వేదం ప్రకారం.. వేపలో అపారమైన ఔషధ గుణాలు ఉంటాయి. వేప ఆకుల సారాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్ఫెక్షన్ వ్యాప్తిని అరికట్టవచ్చు. డెంగ్యూ బాధితులకు సైతం ఈ సూత్రం వర్తిస్తుంది.
- మెంతి ఆకులు
డెంగీ పాజిటివ్ ఉన్న వ్యక్తులకు మెంతి ఆకుల సారం ఉపశమనం కల్పిస్తుంది. మెంతి ఆకులను రాత్రంతా నానబెట్టి, ఉదయాన్నే ఆ ద్రవాన్ని వడకట్టి తాగాలి. ఇది బాడీ పెయిన్స్‌ను దూరం చేస్తుంది. ఆయుర్వేదం ప్రకారం.. మెంతి ఆకుల సారాన్ని సహజ నొప్పి నివారిణిగా పరిగణిస్తారు.