బలగం టీవీ, కరీంనగర్:
మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ యువకుడు అమ్మాయి పేరుతో వాట్సాప్‌లో చాట్ చేసిన ముగ్గురు దుండగుల వలలో చిక్కుకున్నాడు. వారు అతడిని కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురి చేశారు. ఈ నెల 11న మంచిర్యాల నుండి కరీంనగర్‌కు వచ్చిన యువకుడిని, తాము అమ్మాయి మనుషులమని చెప్పి సందీప్, ప్రణయ్, రెహాన్ అనే ముగ్గురు వ్యక్తులు రిసీవ్ చేసుకున్నారు.
అనంతరం వారు యువకుడిని కరీంనగర్ శివారులోని వెలిచాల గ్రామ సమీపంలోకి తీసుకెళ్లి చిత్రహింసలకు గురి చేశారు. అంతేకాకుండా అతని వద్ద నుండి రూ. 50 వేలు డిమాండ్ చేశారు. బాధితుడు తన వద్ద ఉన్న రూ.10 వేలు వారికి ఇవ్వగా, మరో రూ.12 వేలు ఫోన్ పే ద్వారా చెల్లించాడు. ఆ తర్వాత వారి నుండి తప్పించుకున్న యువకుడు జరిగిన సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సందీప్, ప్రణయ్‌లను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడు రెహాన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.