కేటీఆర్‌ పై ఆది శ్రీనివాస్ ఫైర్..

0
94
  • రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీపై, ఆ పార్టీ నాయకుడు కేటీఆర్ (KTR) వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పార్టీ “ఖాతం” అయ్యిందని ఆయన వ్యాఖ్యానించారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొదటి, రెండవ విడుత పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ ఓటమి పాలైంది. కేవలం పరువు కాపాడుకోవడం కోసమే, మూడో విడత ఎన్నికల ప్రచారంలో లబ్ధి పొందడానికి కేటీఆర్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. జిల్లాలో బీఆర్‌ఎస్ కేవలం 60 స్థానాల వద్దే ఆగిపోయిందని, కానీ కేటీఆర్ మాత్రం 83 స్థానాలు గెలిచాం అని గొప్పలు చెప్పుకుంటున్నారని, ఇది ఎన్నికల్లో గెలవలేక పరువు నిలుపుకునే ప్రయత్నంలో చేస్తున్న తప్పుడు అంకెల గారడీ అని ఆది శ్రీనివాస్ ఆరోపించారు. 83 సీట్లు గెలిచిన పేర్లు చెప్పగలరా అని కేటీఆర్‌కు సవాల్ విసిరారు. రెండు విడతల్లో రాష్ట్రంలో, జిల్లాలో కాంగ్రెస్ పార్టీదే హవా అని, మూడో దశలో కూడా మెజారిటీ స్థానాలు తామే సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ద్వారానే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. 2009 ఎన్నికల్లో కేటీఆర్ కేవలం 175 ఓట్ల తేడాతోనే గెలిచారనే వాస్తవాన్ని మర్చిపోకూడదని గుర్తు చేశారు. “యువరాజుగా చక్రం తిప్పిన” కేటీఆర్‌కు 2023 ఎన్నికల్లో మెజారిటీ ఎందుకు తగ్గిందో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. “యువరాజుగా ఉన్నప్పుడే నీ మెజారిటీ 89 వేల నుండి 27 వేలకు దిగజారింది” అని విమర్శించారు.

తాను ఓడినా, గెలిచినా ప్రజల మధ్యే ఉన్నానని, కేటీఆర్ లాగా ప్రజలను విడిచిపెట్టి పట్టణానికి పారిపోలేదని ఘాటుగా విమర్శించారు. కేటీఆర్ స్వంత చెల్లి (కవిత) పార్టీని వదిలి వెళ్లారని, ఆమె చేసిన కామెంట్లకే సమాధానం చెప్పుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. భూ కబ్జాలపై ఆమె వేసిన ప్రశ్నల వర్షానికి ముందు సమాధానం చెప్పాలన్నారు. కేటీఆర్ హత్యా రాజకీయాలపై మాట్లాడడం హాస్యాస్పదం అని ప్రభుత్వ విప్ అన్నారు.

వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ నాయకుని గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే, చంపడానికి యత్నించిన బీఆర్‌ఎస్ పార్టీ హత్యా రాజకీయాల గురించి మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. ఓటమి అక్కసుతోనే ఒక దళిత నాయకునిపై బీఆర్‌ఎస్ దాడి చేసిందని ఆరోపించారు. “గ్రామాల్లో సర్పంచ్‌లు ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు, మూడవ విడత పంచాయతీ ఎన్నికలు పూర్తి కాలేదు కానీ కేటీఆర్‌కు అప్పుడే లీగల్ సెల్ ఏర్పాటు చేస్తాను అంటున్నారు” అని, ఈ లీగల్ సెల్ పార్టీని కాపాడుకోవడానికేనని విమర్శించారు.

కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పుతో వదిలిపెట్టిపోయిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అప్పును భరిస్తూనే అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళలా ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం పది రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదని, అబద్ధపు ప్రచారాలు సరికాదు కేటీఆర్ అని, వారు చేసిన రుణమాఫీ ‘మిత్తులకే’ సరిపోయిందని విమర్శించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here