ఏసీబీ వలలో రూ. 100 కోట్ల అవినీతి ‘తిమింగలం’..

0
62

తప్పుడు సర్వే నెంబర్లతో ప్రభుత్వ భూములు కట్టబెట్టి అక్రమాస్తులు కూడబెట్టిన రంగారెడ్డి ఏడీ శ్రీనివాసులు

బలగం టీవీ, హైదరాబాద్:

రంగారెడ్డి జిల్లా సర్వే, సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ)గా పనిచేస్తున్న కొత్తమ్ శ్రీనివాసులు అక్రమాస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలలో చిక్కారు. తప్పుడు సర్వే నెంబర్లను ఉపయోగించి ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు అక్రమంగా కట్టబెట్టి, ఏకంగా రూ. 100 కోట్ల విలువైన ఆస్తులు దండుకున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.

సంపాదనకు మించిన ఆస్తులు కూడబెట్టారనే ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు శ్రీనివాసులు నివాసంతో పాటు ఆయన స్నేహితులు, బినామీల నివాసాలు, రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లోని ఆయన కార్యాలయంలో విస్తృత స్థాయి తనిఖీలు నిర్వహించారు.

శ్రీనివాసులుకు మై హోమ్ భూజలో ఒక విలాసవంతమైన ఫ్లాట్, అనంతపురంలో 11 ఎకరాల భూమి, కర్ణాటకలో 11 ఎకరాల భూమి, మహబూబ్‌నగర్ జిల్లాలో 4 ప్లాట్లు, నారాయణపేటలో ఒక రైస్ మిల్, 4 ప్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. తన ఇంట్లో సోదాలు చేస్తుండగా 1.6 కిలోల బంగారం, రూ.5 లక్షల నగదు, 770 గ్రాముల వెండి లభించినట్లు అధికారులు తెలిపారు. శ్రీనివాసులు మీద గతంలో కూడా ఏసీబీ కేసు నమోదు కావడంతో కొంతకాలం సస్పెన్షన్‌లో ఉండి తిరిగి విధుల్లో చేరినప్పటికీ, తన పద్ధతి మార్చుకోలేదని ఏసీబీ అధికారులు తెలిపారు. అక్రమాస్తులపై పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగుతోందని వారు వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here