ఏసీబీ దాడులు: హోంగార్డు సంతోష్ లంచం కేసులో అరెస్ట్..

0
179

బలగం టీవీ, సిద్దిపేట:

మిరుదొడ్డి పోలీస్ స్టేషన్‌లో గురువారం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన హోంగార్డు ఎరికోటి సంతోష్ కుమార్‌ను రిమాండ్‌కు తరలించారు. ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ తెలిపిన వివరాల ప్రకారం, హైదరాబాద్‌కు చెందిన అమీర్ అనే వ్యక్తి వ్యక్తిగత పనులపై దుబ్బాక నుంచి మిరుదొడ్డి మీదుగా హైదరాబాద్‌కు బైక్‌పై వెళ్తుండగా, మిరుదొడ్డి శివారులో అతని బైక్ అదుపుతప్పి స్థానికుడైన రాజు వాహనాన్ని ఢీకొంది. ఈ ఘటనపై రాజు మిరుదొడ్డి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

ఈ విషయంలో హోంగార్డు సంతోష్, వ్యవహారాన్ని సర్దుబాటు చేస్తానని చెప్పి, అమీర్ నుంచి రూ.15,000 లంచం డిమాండ్ చేశాడు. చర్చల అనంతరం రూ.10,000 కు ఒప్పందం కుదిరింది. అమీర్ ఏసీబీ అధికారులను సంప్రదించడంతో, వారు ఉచ్చు సిద్ధం చేశారు. సంతోష్ రూ.2,000 స్వయంగా తీసుకోగా, హోటల్ యజమాని శేఖర్‌కు రూ.2,000, వైన్ షాప్ ఉద్యోగి నేరెళ్ల రాజుకు రూ.3,000, రైతు బెజుగామ రాజుకు రూ.3,000 ఇవ్వాలని సూచించాడు. ఏసీబీ బృందం సంతోష్‌ను లంచం స్వీకరిస్తుండగా పట్టుకుని, అతనిపై కేసు నమోదు చేసింది. అరెస్టయిన సంతోష్‌ను న్యాయస్థానంలో హాజరుపరిచారు, ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. బాధితుడు తెలిపిన వివరాలతో ముగ్గురిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకొని విచారణచేసి హోంగార్డు సంతోష్‌పై కేసు నమోదుచేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here