– బస్సులో ప్రయాణికుడి క్యాష్ బ్యాగ్ దొంగిలించిన నిందితుడు అరెస్ట్.. ₹3,92,500 స్వాధీనం.. రిమాండ్‌కు తరలింపు..
- సిరిసిల్ల డిఎస్పీ నాగేంద్రచారి.
బలగం టీవీ, సిరిసిల్ల:
బస్సులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి వద్ద నుండి డబ్బులున్న బ్యాగ్‌ను దొంగిలించిన కేసులో నిందితుడిని సిరిసిల్ల పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి దొంగిలించబడిన రూ. 3,97,500 నగదులో రూ. 3,92,500/- నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సిరిసిల్ల డిఎస్పీ నాగేంద్రచారి గురువారం విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు.
ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ.. వేములవాడకు చెందిన నార్ల శ్రీనివాస్ అనే వ్యక్తి హోల్‌సేల్ దుకాణాలకు చెల్లించాల్సిన రూ. 3,97,500 నగదును, అలాగే తన ఆధార్ కార్డు, పాన్ కార్డు, హెల్త్ కార్డు, ప్రెస్ అక్రిడేషన్ కార్డు, బస్ పాస్, రెండు చెక్కులు ఉన్న పర్సును క్యాష్ బ్యాగ్‌లో ఉంచుకున్నారు. డిసెంబర్ 3న ఉదయం 11:40 గంటలకు ఆయన ఈ బ్యాగ్‌తో వేములవాడ బస్టాండ్ వద్ద సిద్ధిపేట వెళ్లే బస్సు ఎక్కారు. శ్రీనివాస్ లాస్ట్ సీట్ కింద బ్యాగ్‌ను ఉంచి కూర్చున్నారు. కొద్దిసేపటి తర్వాత ఆయన ముందు సీటుకు మారి కూర్చున్నారు.
సుమారు 12:15 గంటలకు తంగళ్ళపల్లి వద్దకు చేరుకునే సరికి వెనుక సీటుకు వెళ్లి చూసుకోగా బ్యాగ్ కనిపించలేదు. కండక్టర్‌ను విచారించగా, సిరిసిల్ల వద్ద ఒక వ్యక్తి బస్సు దిగినట్టు తెలిపారు. దీంతో శ్రీనివాస్ సిరిసిల్ల పట్టణ పోలీసులను ఆశ్రయించారు. శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, వెంటనే రెండు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి వేములవాడ నుండి సిరిసిల్ల వరకు ఉన్న అన్ని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఈ ఫుటేజీల ఆధారంగా నిందితుడిని వేములవాడ మండలం రుంద్రారం గ్రామానికి చెందిన బండారి బాలరాజు (తండ్రి: పర్శరాములు, వయస్సు: 50 సం||లు) గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల విచారణలో నిందితుడు బాలరాజు తన నేరాన్ని ఒప్పుకున్నాడు. తాను వేములవాడలోనే సిద్ధిపేట బస్సులో ఎక్కి వెనుక సీటులో కూర్చున్నానని, ఫిర్యాది తన పక్కనే సీట్ కింద బ్యాగ్‌ను ఉంచడం గమనించానని తెలిపాడు. అవకాశం దొరికినప్పుడు బ్యాగ్‌లోని డబ్బులను దొంగతనం చేయాలని భావించి, సిద్ధిపేట్ టికెట్ తీసుకున్నప్పటికీ చంద్రంపేట్ వద్ద దిగానని ఒప్పుకున్నాడు. పోలీసులు నిందితుడి వద్ద నుండి మొత్తం నగదులో రూ. 3,92,500/- నగదును రికవరీ చేసి, నిందితుడిని రిమాండ్‌కు తరలించడం జరిగిందని డీఎస్పీ తెలిపారు.
ఈ సందర్భంగా డిఎస్పీ నాగేంద్రచారి ప్రయాణికులకు కొన్ని సూచనలు చేశారు. బస్సులలో ప్రయాణించేటప్పుడు చుట్టూ ప్రక్కల ఉన్న వారిని గమనిస్తూ ఉండాలని, విలువైన వస్తువులు, నగలు మరియు డబ్బులు ఉన్న బ్యాగులను వారి చేతిలోనే పట్టుకుని జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. అలాగే, ఇతరులు ఇచ్చే తినే వస్తువులు గాని, వాటర్ గాని తీసుకోకూడదని సూచించారు.
ఈ కేసును చాకచక్యంగా చేధించిన పట్టణ ఇన్స్పెక్టర్ కృష్ణ, సిబ్బంది శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాస్, నాగరాజు, రవికుమార్ లను డిఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.



