రాజన్న సిరిసిల్లలో నిబంధనలు ఉల్లంఘిస్తున్న వైన్ షాపులపై చర్యలు తీసుకోవాలి..

0
52
  • సిపిఎం జిల్లా కార్యదర్శి ముశం రమేష్

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి ముశం రమేష్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిబంధనలు పాటించకుండా వైన్ షాపులు నిర్వహిస్తున్న యజమానులపై తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను డిమాండ్ చేశారు.

ఈరోజు సీపీఎం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని పలు వైన్ షాపులు అధికారుల అండదండలతో బార్లను తలపించే విధంగా సిట్టింగ్ సదుపాయాలు ఏర్పాటు చేసి మద్యం విక్రయిస్తున్నట్లు ఆరోపించారు. ముఖ్యంగా సిరిసిల్ల పట్టణంలోని పాత బస్టాండ్, కొత్త బస్టాండ్, గాంధీ చౌక్ ప్రధాన రహదారి పరిసర ప్రాంతాల్లో ఉన్న వైన్ షాపుల వద్ద వాహనాలు నిర్బంధంగా నిలిపివేయడం వల్ల ట్రాఫిక్ సమస్యలు తీవ్రమవుతున్నాయని తెలిపారు. ఆ ప్రాంతాల్లో మహిళలు సంచరించడానికి కూడా భయపడే పరిస్థితి నెలకొన్నదన్నారు.

గ్రామాల్లో గల్లీ గల్లీకి బెల్ట్ షాపులు పెరిగిపోవడంతో రాత్రింబగళ్లు మద్యం సులభంగా లభ్యమవుతోందని, దీనివల్ల ప్రజలు మద్యానికి బానిసలవుతూ కార్మిక కుటుంబాలు ఆర్థికంగా దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు. యువత మద్యానికి అలవాటు పడి ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం మద్యం ద్వారా వచ్చే ఆదాయంపైనే దృష్టి సారిస్తోందని, ప్రజల ఆరోగ్యం, ప్రాణాల పరిరక్షణపై సరైన శ్రద్ధ చూపడం లేదని విమర్శించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న వైన్ షాపుల లైసెన్సులు రద్దు చేసి, బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు.

ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎగమంటి ఎల్లారెడ్డి, కోడం రమణ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here