జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇవ్వకుంటే ఉద్యమమే, అల్లం నారాయణ హెచ్చరిక…

0
38
  • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జర్నలిస్టులు కనిపించడం లేదా?
  • గత ప్రభుత్వ పథకాలను ఎందుకు విస్మరిస్తున్నారు?
  • ప్రమాద బీమా సొమ్ము వెంటనే చెల్లించాలని ఆస్కాని మారుతి సాగర్ డిమాండ్

బలగం టీవీ, హైదరాబాద్:

రాష్ట్రంలోని జర్నలిస్టులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా క్యాష్‌లెస్‌ హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని మీడియా అకాడమీ మాజీ చైర్మన్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఘాటుగా స్పందించారు.

ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఉద్యోగుల హెల్త్ స్కీమ్ గురించి ప్రకటించిన ప్రభుత్వం, జర్నలిస్టుల ఊసే ఎత్తకపోవడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం జి.ఓ. 64 ద్వారా జర్నలిస్టులకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం అందేలా చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సౌకర్యాలను కూడా తొలగిస్తోందని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు మెరుగైన సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి, అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా జర్నలిస్టులకు ఒక్క పైసా కూడా విదిల్చలేదని విమర్శించారు. కొత్త పథకాలు ఇవ్వకపోగా, ఉన్న అక్రెడిటేషన్ కార్డులలో కోత విధించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

“తెలంగాణ సాధన కోసం 14 ఏళ్లు పోరాడాం. ఇప్పుడు జర్నలిస్టుల హక్కుల కోసం మరో పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. మా దృష్టిలో జర్నలిస్టులు ఉన్నారా? లేరా? అనేది ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి.” అల్లం నారాయణ

టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం అమలు చేసిన రూ. 5 లక్షల ప్రమాద బీమా (జి.ఓ. 22) ప్రీమియంను ప్రస్తుత ప్రభుత్వం రెన్యువల్ చేయకపోవడం దారుణమన్నారు. హోంగార్డులు, ఆటో డ్రైవర్లు, జర్నలిస్టులకు వర్తించే ఈ బీమాను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో టీయూడబ్ల్యూజే నేతలు ఎ. రమణ కుమార్, పి. యోగానంద్, యార నవీన్ కుమార్, బాపు రావు, కడకంచి వెంకటేష్, లాయక్ పాషా తదితరులు పాల్గొని జర్నలిస్టుల ఐక్యతను చాటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here