తమ కారుకి ఆర్టీసీ (APSRTC) బస్సు డ్రైవర్ దారి ఇవ్వలేదని ఆరోపిస్తూ… కొందరు దుండగులు ఆ డ్రైవర్‌ని చితకబాదిన ఘటన ఆంధ్రప్రదేశ్… విజడయవాడ బైపాస్ దగ్గర జరిగింది. విజయవాడ నుంచి కావలి వెళ్తున్న బస్సు డ్రైవర్‌ని బైపాస్ దగ్గర అడ్డుకున్న దుండగులు… బస్సు నుంచి ఆయన్ని కిందకు లాగేశారు. తర్వాత పిడిగుద్దులు గుద్దారు. కాళ్లతో తన్నారు. మెడపై కాలితో తొక్కారు. దాదాపు ఐదారుగురు కలిసి ఈ దాడి చేశారు. ఒక్కరే అవ్వడంతో డ్రైవర్ వాళ్లను ఎదుర్కోలేకపోయారు.
ఇంత జరుగుతున్నా… ప్రయాణికులు గానీ, అటుగా వెళ్లే వాహనదారులు గానీ.. ఆ దుండగులను అడ్డుకునే ప్రయత్నం చెయ్యలేదు. బహుశా ఆ దుండగులు తమను కూడా అలాగే కొడతారేమో అని వారు భయపడి ఉండొచ్చు. ఎందుకంటే ఆ దుండగుల దాడి ఆ స్థాయిలో ఉంది.
దాడితో డ్రైవర్ సొమ్మసిల్లి పడిపోగా.. ఓ ముసలాయన ఆ డ్రైవర్‌కి సపోర్ట్ ఇచ్చేందుకు రాగా.. అతన్ని కూడా ఆ దుండగులు చితకబాదారు. ఇందుకు సంబంధించిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బస్సు డ్రైవర్‌పై ప్రాణం పోయేంతలా దాడిచేసిన ఆ దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. చట్ట ప్రకారం వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. పట్టపగలు, విజయవాడ లాంటి చోట.. దుండగులు ఇంతలా రెచ్చిపోతున్నారంటే,… లా అండ్ ఆర్డర్, పోలీసులంటే వారికి ఏమాత్రం భయంలేదని అర్థమవుతోందనీ, పోలీసులు ఇలాంటి ఘటనల్ని తేలిగ్గా తీసుకుంటే, రాన్రానూ ఇలాంటి నేరాలు మరింత పెరుగుతాయని ప్రజలు అంటున్నారు.