నేనూ త్వరలోనే విశాఖ వచ్చేస్తా అని ఈ మధ్య సీఎం వైఎస్ జగన్ అన్నారో లేదో.. దానిపై చాలా చర్చలు జరిగాయి. ఈ మాట చాలాసార్లు అన్నారు అని కొందరు సెటైర్లు వెయ్యగా.. చెప్పింది చేసి చూపిస్తారని వైసీపీ నేతలు అన్నారు. అసలు విషయం ఏంటంటే.. విశాఖ నుంచి పాలన సాగించడానికి ఏం చెయ్యాలో అదంతా జగన్ చేస్తున్నారు. ఇందుకోసం ఈమధ్య ఆయన ట్రాన్సిట్ అకామిడేషన్ కమిటీ సభ్యులను అక్కడికి పంపారు. ఆ కమిటీ అక్కడ తిరిగి.. ఓ రిపోర్టు రెడీ చేసింది. ఆ రిపోర్టును ఇవాళ సీఎం జగన్‌కి ఇవ్వబోతోంది. ఆ తర్వాత బంతి జగన్ కోర్టులో ఉంటుంది.
విశాఖలో సీఎం జగన్‌తోపాటూ.. మంత్రులు, అధికారుల కోసం తాత్కాలిక కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు వీలుగా ఉన్న భవానాల్ని ఈ కమిటీ సభ్యులు పరిశీలించారు. దాదాపు నెలపాటూ అంతా తిరిగి.. మొత్తం డేటా సేకరించి, రిపోర్టు రెడీ చేశారు. సో.. సీఎం జగన్ చేతిలోకి రిపోర్ట్ రాగానే.. ఇక ఆయన ఎప్పుడు షిప్ట్ అవ్వాలి అనేది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
నిజానికి దసరా నుంచే విశాఖ నుంచి పాలన సాగించాలి అనుకున్నారు. కానీ కుదరలేదు. రకరకాల అంశాలు బ్రేక్ వేశాయి. ఈమధ్య ఇన్ఫోసిస్ సెంటర్‌ను విశాఖలో ప్రారంభిస్తూ.. తాను కూడా త్వరలోనే.. డిసెంబర్ లోపు విశాఖకు షిఫ్ట్ అవుతాననీ, అక్కడి నుంచే పరిపాలన సాగిస్తానని జగన్ అన్నారు. ఐతే.. సీఎం జగన్.. ఇదే మాటను ఇదివరకు కూడా ఒకట్రెండు సార్లు అన్నారు. కానీ ఇప్పటివరకూ అది జరగలేదు.
విశాఖ నుంచి పాలన సాగించేందుకు న్యాయ సమస్యలు అడ్డుగా నిలుస్తున్నాయి. అమరావతి నుంచే పరిపాలన సాగించాలంటూ… కొందరు పిటిషన్లు వెయ్యడంతో.. ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. దాంతో.. ప్రభుత్వం విశాఖకు తరలిపోవడానికి ఒకింత సంశయిస్తోంది. తీరా విశాఖకు వెళ్లాక.. సుప్రీంకోర్టు.. అమరావతి నుంచే పాలన సాగించాలి అని తీర్పు ఇస్తే, అది ప్రభుత్వానికి సమస్యగా మారుతుంది కాబట్టి.. జగన్ ఈ విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ఐతే.. డిసెంబర్ లోపు షిఫ్ట్ అవుతానని అన్నారు కాబట్టి.. దీపావళి తర్వాత ఈ దిశగా అడుగులు పడే అవకాశాలు ఉన్నాయి.