బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల :
లక్ష్యానికి అనుగుణంగా వస్త్ర ఉత్పత్తి చేయాలి
హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్స్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామయ్యార్
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ ప్రకారం లక్ష్యానికి అనుగుణంగా వస్త్రం ఉత్పత్తి చేయాలని
హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్స్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామయ్యార్ సూచించారు. శుక్రవారం వస్త్ర పరిశ్రమకు చెందిన యజమానులు, ఆసాములు, కార్మికులు, టెక్టైల్ పార్క్ పరిశ్రమల యజమానులతో సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్స్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామయ్యార్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటిదాకా ఎంత ఉత్పత్తి చేశారో ఆరా తీశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలు, సమగ్ర శిక్ష అభియాన్, మహిళా శక్తి చీరల ఆర్డర్లపై సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆయా శాఖలకు ఆయా శాఖల నుంచి సిరిసిల్ల వాసన పరిశ్రమకు అందించిన ఆర్డర్లలో 50 శాతం మార్చి 15వ తేదీలోగా అందజేయాలని ఆదేశించారు. ఆయా వస్త్రాల ఉత్పత్తిలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అని అడిగి తెలుసుకున్నారు. గతంలో తాము ఉత్పత్తి చేసిన వస్త్రాలకు సంబంధించిన బిల్లులు చెల్లించాలని, సెస్ విద్యుత్తు బ్యాక్ బిల్లింగ్ సమస్య పరిష్కరించాలని, యంత్రాల కొనుగోలు తదితర అంశాలకు సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్స్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామయ్యార్ మాట్లాడుతూ జిల్లాలోని యజమానులు, ఆసాములు, కార్మికుల్లో అర్హులైన వారందరికీ బ్యాంకుల నుంచి రుణాలు అందజేసే ప్రక్రియ ప్రారంభమైందని, వివిధ శాఖలకు సంబంధించిన బకాయిలను త్వరలోనే అందజేస్తామని అన్నారు. విద్యుత్ బ్యాక్ బిల్లింగ్ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని,సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ఆరు నెలల పాటు ఉపాధి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. దీనికి అనుగుణంగా సిరిసిల్లలోని పరిశ్రమ బాధ్యులు ప్రణాళిక ప్రకారం ఉత్పత్తి చేయాలని, మిగతా రోజుల్లో ప్రైవేట్ మార్కెట్ నుంచి ఆర్డర్లు పొందేలా సిద్ధం కావాలని, మార్కెట్ అనుగుణంగా సిద్ధం కావాలని అన్నారు. పరిశ్రమకు సంబంధించి వివిధ సమస్యలపై చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల సమీక్షించారని, వస్త్ర పరిశ్రమ బాధ్యులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే రాతపూర్వకంగా తమ దృష్టికి తీసుకురావాలని, వాటిని త్వరితగతిన పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. వస్త్ర పరిశ్రమ బాధ్యులు ఆయా శాఖల ఆర్డర్లు తీసుకుని పూర్తి చేసి అందజేయాలని,దీంతో ఇంకా ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంటుందని,ఆలస్యం అయితే పరిశ్రమపై ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన యార్న్ బ్యాంక్ నుంచి ముడి సరుకు పంపిణీలో ఇబ్బందులు త్వరలోనే అన్ని పరిష్కరిస్తామని తెలిపారు.
ఈ సమావేశంలో జిఎం టీ.జీ.ఎస్.కో రఘునందన్, ఎ.డి టీ.జీ.ఎస్.కో సందీప్ జోషి గౌతమ్, ఏ.డి. హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ సాగర్ ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.