బలగం టీవీ, హైదరాబాద్:
మాజీ ఎంపీ బాల్క సుమన్ అరెస్ట్‌ను రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ డా. దూదిమెట్ల బాలరాజు యాదవ్ తీవ్రంగా ఖండించారు. ఈ అరెస్ట్ ప్రజాస్వామ్యానికి తీరని మచ్చ అని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తోందని విమర్శించారు.
శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన పోలీసులు అధికార పార్టీ కార్యకర్తల్లా వ్యవహరిస్తూ, ప్రశ్నించే నాయకులను వేధింపులకు గురిచేయడం దుర్మార్గమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలిచ్చిన తీర్పును గౌరవించకుండా పోలీసులను అడ్డంపెట్టుకుని అధికార మదంతో వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
క్యాతనపల్లి ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇచ్చినా, ఆ తీర్పును గౌరవించకుండా “క్యాంప్ రాజకీయాలు” నడపడం దురదృష్టకరమని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారనే భయంతో సుమన్ గొంతు నొక్కేందుకు పోలీసులను అస్త్రాలుగా వాడుకుంటున్నారని ఆరోపించారు. బాల్క సుమన్‌పై నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తివేయాలని, పోలీసు యంత్రాంగం నిష్పక్షపాతంగా వ్యవహరించాలని డా. దూదిమెట్ల డిమాండ్ చేశారు. “ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడతారా? ఇదేనా మీ ప్రజాపాలన?” అని ప్రశ్నించారు.
ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, పార్టీ పక్షాన ప్రజల తరపున నిలబడి పోరాటం చేయడం ఆపమని ఆయన స్పష్టం చేశారు.
