బలగం టీవీ, హైదరాబాద్:
రాజకీయాలకే పరిమితం కాకుండా సామాజిక సేవలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి. పేదరికం కారణంగా ఏ ఒక్క విద్యార్థి ఉన్నత చదువులకు దూరం కాకూడదనే సంకల్పంతో, తన వ్యక్తిగత సేవా సంస్థ బి.ఎల్.ఆర్ (BLR) చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 16 మంది ఎంబీబీఎస్ (MBBS) విద్యార్థులకు ఆర్థిక భరోసా కల్పించారు.
బుధవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా ఈ 16 మంది విద్యార్థులకు వారి విద్యా సంవత్సర ఫీజుల నిమిత్తం చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు చెక్కులు అందజేసిన కేటీఆర్, వారి ఉజ్వల భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. “సామాజిక బాధ్యతతో పేద విద్యార్థులు వైద్యులుగా ఎదిగేందుకు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అందిస్తున్న సహకారం అభినందనీయం. ప్రతి ఏటా విద్యార్థుల చదువుల కోసం ఆర్థిక సాయం చేస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్న లక్ష్మారెడ్డి సేవా దృక్పథం ప్రజాప్రతినిధులందరికీ ఆదర్శనీయం” అని కొనియాడారు.
ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ. బి.ఎల్.ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిరంతరం ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల వైద్య విద్య ఆగిపోకూడదనే లక్ష్యంతోనే ఈ సాయం అందిస్తున్నామని, భవిష్యత్తులో వీరంతా గొప్ప వైద్యులుగా మారి సమాజానికి సేవ చేయాలని ఆయన ఆకాంక్షించారు.
ఫీజుల భారం నుంచి విముక్తి కల్పించి, తమ డాక్టర్ కల నిజం చేస్తున్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కి, తమను ప్రోత్సహించిన కేటీఆర్ కి విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.



