బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల :
- సామాజిక ఫించన్ లను రుణాల కింద జమ చేస్తె క్రిమినల్ చర్యలు
- రైతు భరోసా, ఇతర సంక్షేమ పథకాల కింద అందే డబ్బులను రుణాలకు జమ చేయరాదు
- బ్యాంకింగ్ సేవలు ప్రజలకు అందేలా చర్యలు
- యువతకి స్వయం ఉపాధి అందేలా రుణాలను సత్వరం మంజూరు చేయాలి
- బ్యాంకర్లతో డీ.సీ.సీ./డీ.ఎల్.ఆర్.సి సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్
ప్రభుత్వ లక్ష్యాల సాధనలో బ్యాంకర్లు తోడ్పాటు అందించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ బ్యాంకర్లను ఆదేశించారు.శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సమీకృత జిల్లా కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో బ్యాంకర్లతో డీసీసీ/డీ.ఎల్.ఆర్.సి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం జారీ చేసే సామాజిక పింఛన్లను కొన్ని బ్యాంకులు వివిధ రుణాల కింద జమ్మ చేసుకుంటున్నట్లు సమాచారం అందుతుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం అందించే పథకాలు సొమ్మును రుణాల కింద జమ చేసుకోవడానికి వీలు లేదని, వెంటనే సంబంధిత లబ్దిదారులకు ఆ సొమ్మును చేర వేయాలని, లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేసే బ్యాంకుల పై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.
గత సమావేశంలో జిల్లాలో 3 కొత్త బ్యాంకులో ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించామని, ప్రస్తుతం చందుర్తి మండలం మల్యాల గ్రామంలో యూ.బి.ఐ బ్యాంకు బ్రాంచ్ ఏర్పాటుకు పనులు జరుగుతున్నాయని, రుద్రాంగి మండలం, కొన రావు పేట్ మండలంలో కూడా బ్యాంకుల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు.
గ్రామీణ స్థాయిలో ప్రజలకు బ్యాంకింగ్ సేవలు అందేలా చర్యలు చేపట్టాలని అన్నారు.బ్యాంకుల ద్వారా ప్రజలకు అందే రుణాలు పెరగాలని, జిల్లాలో డిసెంబర్ 31 నాటికి క్రెడిట్ డిపాజిట్ నిష్పత్తి 128.81% ఉందని, జిల్లాలో ప్రతి బ్యాంకు సిడి నిష్పత్తి పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
జిల్లాలోని రైతులకు పంట రుణాల క్రింద 1,519 కోట్లు పంపిణీ చేయడం లక్ష్యం కాగా డిసెంబర్ చివరి నాటికి 808 కోట్ల పంపిణీ చేశామని, పెండింగ్ లక్ష్యాన్ని చివరి క్వార్టర్ లో యాసంగి పంటకు పూర్తి చేసేందుకు కృషి చేయాలని, వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తూ పంట పెట్టుబడి కోసం పంట రుణాలు బ్యాంకుల నుంచి మాత్రమే తీసుకునేలా చూడాలని అన్నారు.
వ్యవసాయ టర్మ్ రుణాల కింద 421 కోట్ల రూపాయల రుణ పంపిణీ లక్ష్యానికి గాను 405 కోట్ల 92 లక్షల రుణాలను డిసెంబర్ నాటిక పూర్తి చేయడాన్ని కలెక్టర్ అభినందించారు. రైతుల రుణాలకు రైతు భరోసా నిధులను కొన్ని బ్యాంకులు ఆపుతున్నాయని, ఈ ప్రక్రియను వెంటనే నిలిపి వేయాలని ప్రభుత్వం అందించే సహాయాన్ని రైతులకు తప్పనిసరిగా అందించాలని కలెక్టర్ తెలిపారు.
జిల్లాలో వ్యాపార యూనిట్ల ఏర్పాటుకు బ్యాంకర్లు తోడ్పాటు అందించాలని అన్నారు. ఎం.ఎస్.ఎం.ఈ లకు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 559 కోట్ల రుణాల పంపిణీ లక్ష్యం కాగా 280 కోట్ల రుణం పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. ప్రతి బ్యాంకు బ్రాంచీ నుంచి కనీసం 5 వ్యాపార యూనిట్ల గ్రౌండింగ్ కు చర్యలు చేపట్టాలని, అర్హులైన యువతకు రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
జిల్లాలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మార్చి 5 నాటికి 3 వేల 997 స్వశక్తి సంఘాలకు 498 కోట్ల 64 లక్షలు, మెప్మా కింద 444 సంఘాలకు 54 కోట్ల 7 లక్షల బ్యాంకు రుణాలు అందించామని అధికారులు తెలిపారు. స్వశక్తి సంఘాలకు నిర్దేశించుకున్న లక్ష్యంలో 93 శాతం పూర్తి చేసామని, పెండింగ్ లక్ష్యాన్ని మార్చి నెలాఖరు నాటికి చేరుకోవాలని అన్నారు.
స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు వివిధ పథకాల క్రింద యువతకు రుణాలు అందించాలని, స్టాండ్ అప్ ఇండియా క్రింద డిసెంబర్ చివరి నాటికి 11 యూనిట్లకు కోటి 36 లక్షల, ముద్రా రుణాల కింద 6 వేల 280 మంది లబ్ధిదారులకు 75 కోట్ల 35 లక్షల రుణాలు అందించామని తెలిపారు.
ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం కింద ప్రస్తుత సంవత్సరంలో ఫిబ్రవరి 19 నాటికి 7 కోట్ల 98 లక్షల విలువగల 161 యూనిట్లను గ్రౌండ్ చేయడం జరిగిందని తెలిపారు. యువతకు ఉపాధి అందించే విషయంలో అధికారులు చొరవ చూపాలని , ఈ పథకాల పై విస్తృతంగా ప్రచారం కల్పించాలని కలెక్టర్ బ్యాంకర్లకు సూచించారు.
పి.ఎం.ఎఫ్.ఎం.ఈ ను వినియోగిస్తూ ఇందిరా మహిళా శక్తి పుడ్ ప్రొసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని, ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న 9 డి.పి.ఆర్ లను పరిశీలించి అర్హులైన యూనిట్ల గ్రౌండింగ్ చేయాలని, బ్యాంకు మేనేజర్ వద్ద పెండింగ్లో ఉన్న దరఖాస్తుల పై వెంటనే నిర్ణయం తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
ప్రధానమంత్రి స్వానిధి క్రింద జిల్లాలోని సిరిసిల్ల వేములవాడ మున్సిపల్ పరిధిలో వీధి వ్యాపారులకు రుణాలు అందించాలని,రెండవ సారి తీసుకున్న రుణాలు చెల్లించిన ప్రతి వ్యాపారికి మూడవ సారి 50 వేల వరకు రుణం మంజూరు చేయాలని కలెక్టర్ సూచించారు.
పీఎం విశ్వకర్మ కింద సిరిసిల్ల జిల్లా 53 మంది యూనిట్లకు రుణాల పంపిణీ పూర్తి చేసామని, మరో 355 దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయని వీటిని పరిశీలించే అర్హులకు పీఎం విశ్వకర్మ రుణాలు అందించాలని కలెక్టర్ తెలిపారు.
పశుసంవర్ధక శాఖ, మత్స్యశాఖ పరిధిలో రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి అర్హులకు రుణాలు పంపిణీ చేపట్టాలని అన్నారు. ఎస్సీ యాక్షన్ ప్లాంట్ సంబంధించి 126 యూనిట్ ల గ్రౌండింగ్ పెండింగ్ ఉందని, వీటిని త్వరగా గ్రౌండ్ చేయాలని అన్నారు.
ఎస్సీ కార్పొరేషన్ క్రింద 619 మందు యూనిట్లకు 2 పాడి పశువుల పంపిణీ కోసం సబ్సిడీ విడుదల చేయడం జరిగిందని, ఇప్పటివరకు 236 యూనిట్లు గ్రౌండ్ చేసామని, మరో 208 గ్రౌండింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. పెండింగ్ యూనిట్లను త్వరగా గ్రౌండ్ చేసేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
వ్యవసాయ మార్కెటింగ్ ఇన్ ఫ్రా, ఎఫ్.పి.ఓ , పశుసంవర్ధక వసతుల కల్పన క్రింద కేంద్ర ప్రభుత్వం నాబార్డ్ ద్వారా అమలు చేసే సబ్సిడీ పథకాలపై అవగాహన కల్పిస్తూ అవసరమైన వారు వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని అన్నారు.
ఈ సమావేశంలో లీడ్ బ్యాంకు మేనేజర్ టి.ఎన్.మల్లిఖార్జున్ రావు,యూ.బి.ఐ రీజనల్ హెడ్ అపర్ణ రెడ్డి, ఆర్.బి.ఐ ఎల్.డి.ఓ వి. సాయి తేజ్ రెడ్డి, వివిధ శాఖల బ్యాంక్ కంట్రోలర్స్ ,మేనేజర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.