బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో తేనెటీగల దాడి ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని కోనరావుపేట మండలం పరిధిలోని నిజామాబాద్ గ్రామం శివారులో కాలువ నిర్మాణ పనులు నిర్వహిస్తున్న ఉపాధి హామీ కూలీలపై తేనెటీగలు దాడి చేశాయి.
మంగళవారం ఉదయం దాదాపు 20 నుంచి 30 మంది ఉపాధి హామీ కూలీలు పనుల నిమిత్తం అక్కడికి చేరుకున్నారు. పనులు సాగిస్తున్న సమయంలో పక్కనే ఉన్న చెట్టుకు తేనెటీగల గూడు ఉండటాన్ని గమనించలేదు. ప్రమాదవశాత్తు పనిముట్లలో ఉపయోగించిన పారా చెట్టుకు తగలడంతో గూడు కదిలి, ఒక్కసారిగా తేనెటీగలు గుంపులుగా ఎగసి కూలీలపై దాడి చేశాయి.
ఈ ఘటనలో ఏడుగురు కూలీలు గాయపడగా, మిగతా వారు అక్కడి నుంచి తప్పించుకున్నారు. గాయపడిన వారికి గ్రామంలో ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం సిరిసిల్ల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికు తరలించారు.
ఆసుపత్రి డ్యూటీ డాక్టర్ తెలిపిన వివరాల ప్రకారం, గాయపడిన కూలీల పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని, ఎలాంటి ప్రాణాపాయం లేదని తెలిపారు. బాధితులకు అవసరమైన వైద్యం అందిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.



