బలగం టీవీ, సిరిసిల్ల:
స్థానిక పద్మశాలి కళ్యాణ భవనంలో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్) ఆధ్వర్యంలో విలువలతో కూడిన విద్య మరియు భగవద్గీత శ్లోకాలపై పోటీ పరీక్షలు గురువారం రోజున ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళా చక్రపాణి, ఆర్డీవో వెంకటేశ్వర్లు, డి.ఎస్.పి నాగేంద్ర చారి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథులు విద్యార్థులను ఉద్దేశించి ప్రేరణాత్మక సందేశాలు అందించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళా చక్రపాణి మాట్లాడుతూ, కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి బోధించిన భగవద్గీత మనిషి జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు పరిష్కారం చూపించే గొప్ప గ్రంథమని అన్నారు. ఇది కేవలం మత గ్రంథం మాత్రమే కాకుండా, నిత్య జీవితానికి మానసిక ప్రశాంతతను అందించే అద్భుత మార్గదర్శకమని పేర్కొన్నారు. నేటి వేగవంతమైన జీవితంలో భగవద్గీత సారాంశాన్ని తెలుసుకోవడం ప్రతి ఒక్కరికీ అత్యంత అవసరమని తెలిపారు.
ఇస్కాన్ సిరిసిల్ల ఇంచార్జ్ ప్రాణనాథ అత్యుత దాస్ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని విద్యార్థులకు భగవద్గీత శ్లోకాల సారాంశం, విలువలతో కూడిన విద్య ప్రాముఖ్యతపై అవగాహన కల్పించి, అనంతరం పరీక్షలు నిర్వహించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎంపిక చేసి వారికి బహుమతులు ప్రదానం చేశారు. పోటీల్లో పాల్గొన్న ప్రతి విద్యార్థికి ప్రోత్సాహక బహుమతులు అందించి, వారిలో నైతిక విలువలను పెంపొందించేలా చేసిన ఈ కార్యక్రమానికి ఇస్కాన్ సంస్థను ముఖ్య అతిథులు ప్రత్యేకంగా అభినందించారు.
మార్కుల కోసమే పరుగు తీసే నేటి విద్యా వ్యవస్థలో మానవీయ విలువల బోధనకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదని, విద్యతో పాటు విలువలు కూడా అవసరమని నాయకులు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాలు కూడా విద్యా వ్యవస్థలో మానవీయ విలువలను పెంపొందించే ప్రత్యేక పాఠ్యాంశాలను ప్రవేశపెట్టాలని సూచించారు. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు చెప్పిన శ్లోకాలను అతిథులు ఆసక్తిగా విని అభినందించారు. అనంతరం విజేతలకు బహుమతులు, ఇతర పోటీదారులకు ప్రోత్సాహకాలను అందించారు.
కార్యక్రమంలో అధ్యక్షులుగా అర్బన్ బ్యాంక్ చైర్మన్ రాపల్లి లక్ష్మీనారాయణ, 5వ వార్డ్ కౌన్సిలర్ సభ్యులు, ఎంఈఓ దూస రఘుపతి, ఇస్కాన్ సిరిసిల్ల ఇంచార్జ్ ప్రాణనాథ అత్యుత దాస్, పద్మశాలి కళ్యాణ భవనం సంఘం అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీనివాస్, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ గుడ్ల రవి, ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు అనిల్ ఇస్కాన్ సంస్థ ప్రతినిధులు కోడం అశోక్ పాల్గొని వారి అమూల్యమైన సందేశాన్ని అందించారు.
ఈ కార్యక్రమంలో పుర ప్రముఖులు జిల్లా స్థాయిలో వివిధ పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

