బిట్స్ – పిలానీ హైదరాబాద్‌కు రూ. 36 కోట్ల భారీ విరాళం..

0
24

పూర్వ విద్యార్థి చంద్ పి.గర్గ్ దంపతుల ఉదారత

బలగం టీవీ, హైదరాబాద్:

ప్రముఖ విద్యాసంస్థ బిట్స్ – పిలానీ (BITS Pilani) హైదరాబాద్ క్యాంపస్ అభివృద్ధికి అండగా నిలిచేందుకు ఆ సంస్థ పూర్వ విద్యార్థి, ప్రముఖ వ్యాపారవేత్త చంద్ పి.గర్గ్ మరియు ఆయన భార్య మంజు గర్గ్ రూ. 36 కోట్ల (4 మిలియన్ డాలర్లు) భారీ విరాళాన్ని ప్రకటించారు. విద్యా ప్రమాణాలను మెరుగుపరచడం మరియు పరిశోధనలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ విరాళం అందించారు.

చంద్ పి.గర్గ్ 1968లో బిట్స్ – పిలానీలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. అనంతరం ఆయన అమెరికాలో స్థిరపడి, ఇంటర్నేషనల్ ట్రేడ్స్ మరియు క్రెడిట్స్ వ్యాపార రంగంలో విశేష ప్రతిభ కనబరిచారు. తనను ఉన్నత విద్యావంతుడిగా తీర్చిదిద్దిన సంస్థపై కృతజ్ఞతతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

ప్రపంచవ్యాప్తంగా తమ విద్యా సంస్థల్లో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పేందుకు బిట్స్ – పిలానీ కార్యవర్గం 18 నెలల క్రితం 100 మిలియన్ డాలర్ల నిధిని సమీకరించాలని నిర్ణయించింది. ఈ లక్ష్యంలో భాగంగా గర్గ్ దంపతులు తమ వంతుగా 4 మిలియన్ డాలర్లను (రూ. 36 కోట్లు) హైదరాబాద్ క్యాంపస్‌కు కేటాయించారు. బిట్స్ – పిలానీ పూర్వ విద్యార్థులు ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 34 మిలియన్ డాలర్ల విరాళాలను సేకరించడం విశేషం.

ఈ విరాళంపై బిట్స్ – పిలానీ యాజమాన్యం హర్షం వ్యక్తం చేస్తూ, గర్గ్ దంపతులకు ధన్యవాదాలు తెలిపింది. ఈ నిధులను క్యాంపస్‌లో మౌలిక సదుపాయాల కల్పన, అత్యాధునిక ల్యాబ్‌ల ఏర్పాటు మరియు విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం వినియోగించనున్నట్లు సంస్థ పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here