ఈ నెల 19వ తేదీన తెలంగాణ భవన్‌కు కేసీఆర్
బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, కార్యవర్గ సభ్యులతో సంయుక్త సమావేశం
బలగం టీవీ, హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ అధినేత కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) అధ్యక్షతన ఈ నెల 19వ తేదీన (19.12.2025) పార్టీ శాసనసభాపక్షం (ఎల్పీ) మరియు రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సంయుక్త సమావేశం జరగనుంది. పార్టీ కేంద్ర కార్యాలయం, తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుందని ఒక ప్రకటనలో తెలియజేశారు.
కృష్ణా-గోదావరి జలాలపై ప్రధాన చర్చ
ఈ సమావేశంలో ప్రధానంగా కృష్ణా, గోదావరి జలాల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై చర్చ జరగనుంది. గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకుపోవడంలో చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై సమావేశంలో కేసీఆర్ చర్చిచనున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గోదావరి, కృష్ణా జలాలను కొల్లగొడుతున్నా, దానిని అడ్డుకోవడంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం 90 టీఎంసీలు కేటాయించగా, కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 45 టీఎంసీలు ఇస్తే చాలని కేంద్రం ముందు దేబరించడం బాధాకరమని బీఆర్ఎస్ నాయకత్వం పేర్కొంది. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి 45 టీఎంసీలకు అంగీకరిస్తూ కేంద్రం వద్ద మోకరిల్లి రావడం రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను తాకట్టు పెట్టడమేనని అభిప్రాయపడుతోంది.తెలంగాణ ప్రయోజనాలకు గండి కొడుతున్న కేంద్రంలోని బీజేపీ వైఖరిని, కావేరి తదితర నదుల అనుసంధానం పేరుతో ఆంధ్ర రాష్ట్ర జలదోపిడికి సహకరిస్తున్న కేంద్ర విధానాన్ని సమావేశంలో ఎండగట్టనున్నారు. రాష్ట్రం నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉండి కూడా తెలంగాణ ప్రయోజనాల గురించి ఒక్కరూ మాట్లాడకపోవడంపై విమర్శలు వెల్లువెత్తనున్నాయి. తెలంగాణ ప్రజల, రైతాంగ సాగునీటి హక్కులను కాపాడుకోవడానికి మరో ప్రజా ఉద్యమం తప్పదని పార్టీ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. ఇందులో భాగంగా, తదుపరి చేపట్టబోయే ప్రజా ఉద్యమాల నిర్మాణం, అనుసరించాల్సిన కార్యాచరణపై విస్తృతస్థాయి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నిర్మాణం, జలాల కేటాయింపు మరియు ఆంధ్ర జలదోపిడిపై పోరాడేందుకు ఉద్యమ స్వరూపానికి ఈ సమావేశంలో శ్రీకారం చుట్టడం జరుగుతుందని బీఆర్ఎస్ ప్రకటించింది.
పైన తెలిపిన అంశాలతో పాటు, పార్టీ సంస్థాగత నిర్మాణ విషయాలు సహా పలు కీలక అంశాలను పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన కూలంకషంగా చర్చించి, అందుకు అనుగుణంగా చేపట్టబోయే కార్యాచరణపై నిర్ణయాలు తీసుకుంటారు.

