బలగం టీవీ, పటాన్‌చెరువు, జూన్ 27:
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో కార్మికుల జీవితం దయనీయంగా మారిందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించి మోసం చేశారని ఆరోపిస్తూ పటాన్‌చెరువు ఆటో డ్రైవర్ల సంఘం ప్రతినిధులు శుక్రవారం మాజీ మంత్రి హరీష్ రావును కలిశారు. తమ సమస్యలను బీఆర్‌ఎస్ ముందుండి పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 18 నెలల వ్యవధిలో 142 మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇవి ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వ హత్యలేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఏడాదికి రూ.12,000 భృతి ఇస్తామన్న హామీ ఇచ్చి మోసం చేశారని, కానీ ఇప్పుడు ఆటో కార్మికుల గురించి ఒక్క మాటా మాట్లాడడం లేదని అన్నారు.
ఆటోలు నడవక, బ్యాంకుల కిస్తీలు చెల్లించలేక ఆర్థికంగా కుదేలవుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని హరీష్ రావు అన్నారు. ఆటో కార్మికుల కుటుంబాల పోషణ భారంగా మారి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక మాట తప్పడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిందని అన్నారు.
అసెంబ్లీ వేదికగా కూడా ఆటో కార్మికుల పక్షాన ప్రశ్నించింది బీఆర్ఎస్ పార్టీయేనని హరీష్ రావు గుర్తు చేశారు. కార్మికుల సంక్షేమం కోసం బీఆర్‌ఎస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుందని, ఆటో కార్మికులకు కేసీఆర్ అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల హామీలను అమలు చేసి, ఆటో కార్మికులకు భద్రత కల్పించాలని బీఆర్‌ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. చనిపోయిన ఆటో కార్మికుల కుటుంబాలకు కనీసం రూ.10 లక్షల ఆర్థిక సాయం చేయాలని, రెండేళ్లుగా ఒక్కో కార్మికుడికి బాకీ పడ్డ రూ.24 వేలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.



