బలగం టీవీ, సిరిసిల్ల:
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ని బద్నాం చేయాలనే దురుద్దేశంతోనే కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు ఆదేశించారని బీఆర్ఎస్ నాయకుడు కంచర్ల రవి గౌడ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇది చాలా దురదృష్టకరమని ఆయన అన్నారు.
బుధవారం సిరిసిల్లలోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకుడు కంచర్ల రవి గౌడ్ మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు జీవనాడి అని, ఇది రైతుల కళ్లలో ఆనందం నింపిందని రవి గౌడ్ పేర్కొన్నారు. అలాంటి ఒక అద్భుతమైన ప్రాజెక్టుపై సీబీఐ విచారణ అంటే తెలంగాణ రైతుల హృదయాన్ని గాయపరచడమేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు సాగునీరు అందించిన ఘనత కేసీఆర్ గారిదేనని, అలాంటి మహానాయకుడిని ఎలాగైనా బద్నాం చేసి, తెలంగాణలో బీఆర్ఎస్ ఉనికిని నాశనం చేయాలని కుట్రలు జరుగుతున్నాయని, అయితే తెలంగాణ ప్రజలు వీటిని గమనిస్తున్నారని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ సాక్షిగా ‘కాలేశ్వరం కమిషన్’ పేరుతో బురద జల్లడం అత్యంత దుర్మార్గమని రవి గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభలో హరీశ్ రావు మాట్లాడుతుంటే 33 సార్లు అడ్డుకున్నారని, ఇది వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకే ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోందని తెలంగాణ ప్రజలు గ్రహిస్తున్నారని తెలిపారు. కేసీఆర్ తెలంగాణను సాధించిన మహానాయకుడని, రాష్ట్రం ఉన్నంత కాలం ఆయన తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని రవి గౌడ్ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో వడ్లూరి సాయి సూర్య, కాసర్ల శ్రీనివాస్, యశ్వంత్, అక్రమ్, మహేష్, మున్నా, వడ్లూరి వేణు, కోడం వెంకటేశం, పరకాల హర్షిత్, రాజు తదితరులు పాల్గొన్నారు.
