సెస్ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో జాప్యానికి నిరసనగా విధుల బహిష్కరణ..

0
2020

సెస్‌లో అసిస్టెంట్ హెల్పర్ల 72 గంటల విధుల బహిష్కరణ – సమస్యల పరిష్కారంలో జాప్యంపై ఆగ్రహం

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

సెస్‌లో పనిచేస్తున్న అసిస్టెంట్ హెల్పర్లు తమ సమస్యల పరిష్కారంలో జరుగుతున్న జాప్యానికి నిరసనగా ఈ నెల 11 నుంచి 14 వరకు 72 గంటల పాటు విధులు బహిష్కరించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కే. ఈశ్వర్ రావు, రాష్ట్ర కార్యదర్శి నలువాల స్వామి ప్రకటించారు.

సిరిసిల్ల ప్రెస్ క్లబ్‌లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. అసిస్టెంట్ హెల్పర్ల సమస్యల పరిష్కారం కోసం సెస్ ఎండికి ఐదుసార్లు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ ఒక్క సమస్య కూడా పరిష్కరించలేదని వారు పేర్కొన్నారు. ప్రతి నెల చెల్లించాల్సిన ఎఫ్‌టీఏను గత ఎనిమిది నెలలుగా నిలిపివేశారని, 2025 సెప్టెంబర్ నెలలో ఇవ్వాల్సిన వార్షిక ఇంక్రిమెంట్ ఇవ్వలేదని ఆరోపించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబ సభ్యులను రెగ్యులరైజ్ చేయలేదని, కార్మికులకు లీవ్ ఎన్కాష్మెంట్ విధానం అమలు చేయడం లేదని తెలిపారు. ఏహెచ్‌లుగా పిలువబడే కార్మికులందరూ ఐటీఐ ఎలక్ట్రికల్ పూర్తి చేసినవారేనని, సాంకేతికంగా వారు టెక్నీషియన్లేనని పేర్కొన్నారు. అయితే సెస్‌లో అసిస్టెంట్ హెల్పర్లుగా పిలుస్తూ తక్కువ వేతనాలు చెల్లించడం కార్మిక వ్యతిరేక విధానమని విమర్శించారు. ఈ విధంగా వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని అన్నారు. సమస్యల పరిష్కారంలో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ ఈ నెల 11 నుంచి 14 వరకు 72 గంటల పాటు విధులు బహిష్కరించనున్నట్లు తెలిపారు. ఈ కాలంలో వివిధ రూపాల్లో నిరసనలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికైనా సెస్ చైర్మన్, ఎండీలు యూనియన్ ప్రతినిధులతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని కోరారు.

ఈ సమావేశంలో సెస్ కమిటీ అధ్యక్షుడు కర్నాల అనిల్ కుమార్, కార్యదర్శి ఎస్. శ్రీనివాసరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్ర మల్లేశం, కోశాధికారి ఎస్. రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here