చల్మెడ వ్యాఖ్యలు హాస్యాస్పదం.. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతారా..?

0
68

మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, కాంగ్రెస్ అధ్యక్షుడు సంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, కనికరపు రాకేష్ ధ్వజం

అమావాస్యకు పౌర్ణమికి వచ్చే చల్మెడకు అభివృద్ధి గురించి ఏం తెలుసు? అసలు నువ్వు బీఆర్ఎస్‌లో ఉంటావన్న నమ్మకం నీకుందా?

వేములవాడ అభివృద్ధి చూసి ఓర్వలేకే చల్మెడ విమర్శలు.. ఆది శ్రీనివాస్ హయాంలోనే నియోజకవర్గ ప్రగతి!

ఆది శ్రీనివాస్ చేపడుతున్న అభివృద్ధిని చూసే కాంగ్రెస్ లోకి నరాల శేఖర్

బలగం టీవీ, వేములవాడ:

వేములవాడ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు చేసిన వ్యాఖ్యలను వేములవాడ మున్సిపల్ ఛైర్మన్ పుల్కం రాజు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ తీవ్రంగా ఖండించారు. గురువారం పట్టణంలో వారు విలేకరులతో మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు కిందిస్థాయి నాయకులు రాసిచ్చిన కాగితాలను చూస్తూ చల్మెడ మాట్లాడిన తీరు హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. నియోజకవర్గ పరిస్థితులపై అవగాహన లేకుండా ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం చూసి జనాలు నవ్వుకుంటున్నారని వారు విమర్శించారు. అమావాస్యకు పౌర్ణమికి చుట్టపుచూపుగా వచ్చే చల్మెడకు వేములవాడలో జరుగుతున్న అభివృద్ధి గురించి ఏం తెలుస్తుందని దుయ్యబట్టారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వేములవాడ ఏ విధంగా ఉండేది, ప్రస్తుతం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గెలిచిన తర్వాత పట్టణం ఎంతలా అభివృద్ధి చెందుతుందో ప్రజలు గమనిస్తున్నారని వారు గుర్తు చేశారు.

​ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో నియోజకవర్గం అభివృద్ధి దిశగా దూసుకుపోతుంటే, ఆ ఓర్వలేకనే చల్మెడ ఇటువంటి అవాకులు చవాకులు పేలుతున్నారని ఆరోపించారు. తమ నాయకుడిని విమర్శిస్తే సహించేది లేదని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. మున్సిపల్ వైస్ ఛైర్మన్ నరాల శేఖర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసే పార్టీలోకి వచ్చారని వారు వివరించారు. అనవసరపు విమర్శలు మాని అభివృద్ధికి సహకరించాలని వారు హితవు పలికారు. అసలు చల్మెడ మనస్సాక్షిగా చెప్పుకోవాలని, ఆయన బిఆర్ఎస్ పార్టీలో ఉంటానన్న నమ్మకం ఆయనలో ఉందా అని వారు సూటిగా ప్రశ్నించారు. రాజకీయం కోసం విమర్శలు చేయడం మానుకుని వాస్తవాలను గ్రహించాలని వారు సూచించారు.

ఈ సమావేశంలో కౌన్సిలర్ తుమ్ మధు, తోటరాజు, కొక్కుల బాలు, అన్నారం శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బింగి మహేష్, పులి రాంబాబు, వస్తారు కృష్ణ, కట్కూరి శ్రీనివాస్, ముంజ ఉమేందర్, అరుణ్ తేజ చారి, నాగరాజు సరిపెల్లి కార్తీక్ సరిపెల్లి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here