బలగం టివి, రాజన్న సిరిసిల్ల
- “సిరి పోషణ” పైలట్ ప్రాజెక్టు ప్రారంభ కార్యక్రమంలో : రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీమతి వాకాటి కరుణ
పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు జిల్లాలో ప్రయోగాత్మకంగా చేపట్టిన “సిరి పోషణ” కార్యక్రమం ఎంతగానో ఉపకరిస్తుందనీ రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీమతి వాకాటి కరుణ అన్నారు.
బుధవారం ముస్తాబాద్ మండలం పోత్గల్ గ్రామంలో 6 సంవత్సరాల లోపు విద్యార్థులు, బాలింతలు, గర్భిణులకు ఫిబ్రవరి మాసంలో వారానికి ఒకసారి రాగి లడ్డులు, రాగి జావ, మొలకెత్తిన విత్తనాలు, మల్టీ మిల్లెట్ లడ్డు పంపిణీ చేపట్టేందుకు ఉద్దేశించిన “సిరి పోషణ” పైలట్ ప్రాజెక్టు కార్యక్రమాన్ని కలెక్టర్ అనురాగ్ జయంతి తో కలిసి రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీమతి వాకాటి కరుణ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ….
ఆరోగ్య రంగంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నప్పటికీ పోషకాహారం లోపంతో మహిళలు, పిల్లలు బాధపడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో 40 శాతం మహిళలు ఎనీమియా తో బాధపడుతున్నారన్నారు. 30 శాతం పిల్లలలో వయసుకు తగిన బరువు, ఎత్తు లేదన్నారు. మహిళలు తమ గురించి, తమ ఆరోగ్యం గురించి కంటే తమ కుటుంబ సభ్యుల గురించి ఎక్కువగా ఆలోచిస్తారని చెప్పారు.
“సిరి పోషణ” పైలట్ ప్రాజెక్టు ద్వారా గర్భిణులు ,బాలింతలు, ఆరేళ్లలోపు పిల్లలకు వారానికి ఒకసారి రాగి లడ్డులు, రాగి జావ, మొలకెత్తిన విత్తనాలు, మల్టీ మిల్లెట్ లడ్డు అందించడం ద్వారా పోషకాహార లోపం అనే నెగటివ్ ఫ్యాక్టర్ పాజిటివ్ గా మార్చి తద్వారా వారికి పోషకాహార లోపంతో వచ్చే వ్యాధులను దూరంగా ఉంచవచ్చునన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు మిల్లెట్ ల ప్రాధాన్యత అవగాహన పై పెరుగుతుందన్నారు.
జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి మాట్లాడుతూ… పుట్టబోయే బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలంటే గర్భిణీలు తమ సమీపంలోని అంగడి అంగన్వాడి కేంద్రాలకు తప్పనిసరిగా వెళ్లి అక్కడ అందించే సంతులిత ఆహారాన్ని తీసుకోవాలన్నారు.
జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ… పోషకారా లోపం వల్ల పిల్లల్లో ఫ్యూచర్ గ్రోత్ ఆశించిన మేర ఉండదన్నారు. ప్రభుత్వం పోషకాహారం అందజేస్తున్నప్పటికీ ఇప్పటికీ ఇంకా జిల్లాలో ఎనీమియా సమస్యలతో బాధపడుతున్న మహిళలు, అలాగే ఎదుగుదల లోపంతో బాధపడుతున్న పిల్లలు ఉన్నారన్నారు. దీనిని అధిగమించడానికి సిరిపోషణ్ అనే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు ఫిబ్రవరి మాసంలో జిల్లాలోని 587 అంగన్వాడీ కేంద్రాలలోని 41 వేల మంది
గర్భిణులు, బాలింతలు, ఆరేళ్లలోపు చిన్నారులకు రాగి లడ్డూలను వారానికి ఒకసారి అందజేస్తామన్నారు. అందరి భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసి జిల్లాను పోషకాహార రహిత లోప జిల్లా గా చేస్తామన్నారు.