బలగం టివి, సిరిసిల్ల
జిల్లాలోని తహసీల్దార్లతో కలెక్టర్ అనురాగ్ జయంతి సమావేశమయ్యారు. ఓటరు జాబితా, పెండింగ్ కోర్టు కేసులు, మీ సేవ అప్లికేషన్స్, ప్రభుత్వ భూముల పై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో తహసీల్దార్లతో కలెక్టర్ శుక్రవారం సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఓటరు జాబితాలో డబుల్, చనిపోయిన వారి ఓటు ఉండకూడదని స్పష్టం చేశారు. ఓటు హక్కు తొలగింపు పై సమాచారం ఉండాలని, జాబితాలో మరోసారి చూసుకోవాలని సూచించారు. మీ సేవ ద్వారా వచ్చిన దరఖాస్తులు
పెండింగ్ లో ఉంచవద్దని ఆదేశించారు. పోస్టల్ బ్యాలెట్ నమోదుపై ఆరా తీశారు. వివిధ ప్రభుత్వశాఖల వద్ద ఉన్న భూముల వివరాలు పక్కాగా, సర్వే నెంబర్లతో సహా ఉండాలని స్పష్టం చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ఖీమ్యానాయాక్, పూజారి గౌతమి, సిరిసిల్ల ఆర్డీఓ ఆనంద్ కుమార్, డీఈఓ రమేష్ కుమార్, టెక్స్ టైల్స్ ఏడీ సాగర్, కలెక్టరేట్ పర్యవేక్షకులు శ్రీకాంత్, తహసీల్దార్లు తదితరులు ఉన్నారు.