కామ్రేడ్ కర్రోల్ల నర్సయ్య ప్రజా జీవితం

0
168
స్వార్థం ఎరుగని ప్రజా జీవితం ఆయనది. సుదీర్ఘ జీవనంలో ఆయన   తుపాకీ పట్టి పోరాడిన ప్రజల కోసమే. శాసనసభ్యులుగా  సమస్యలపై అసెంబ్లీ సాక్షిగా ప్రజల పక్షమై గళమెత్తారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ జీవితం కడదాకా కమ్యూనిస్టుగా జీవించిన మహా నాయకుడు. సమాజంలో కుల, మత, వర్గ వైశ్యామ్యాలు తొలగిపోవాలని చివరిదాకా తపించి నిస్వార్థ ప్రజా నాయకుడిగా ఆయన ఆచరణ భవిష్యత్ తరాలకు ఆదర్శం కావాల్సి ఉన్నది.  కొందరు మండల స్థాయి ప్రజా ప్రతినిధులు  అయితేనే ఫామ్ హౌస్ లు విల్లాలు సంపాదిస్తున్న ప్రస్తుత సమాజంలో నమ్మిన విలువల కోసం స్వార్థానికి చోటివ్వకుండా నిస్వార్థంగా ఆయన జీవితం ప్రజల కొరకే దార పోశారు.ఇప్పటి రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావు పేట్ మండలం మల్కాపేట్ గ్రామంలో పేదరికం నుంచే ఆయన పోరాట జెండాను  ఎత్తిపట్టారు.వారసత్వంగా వచ్చిన పెంకుటింట్లో కష్టాల మధ్య జీవించిన ప్రజా నాయకులు. నమ్మిన కమ్యూనిస్టు  సిద్ధాంతం కోసం కడదాకా నిలబడ్డరు.ఆయనే కర్రొళ్ళ నర్సయ్య.  పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్ (పిడిఎఫ్ ) నుంచి సిరిసిల్ల ఉమ్మడి నియోజకవర్గం(నేరెళ్ల ఎస్సీ నియోజకవర్గం సిరిసిల్ల నియోజకవర్గంలో భాగంగా ఉండేది). నుంచి కామ్రేడ్ అమృత లాల్ శుక్ల తో పాటు 1957 నుంచి 62 వరకు శాసనసభ్యులుగా పని చేశారు. అతి సాధారణ జీవనం గడిపిన కర్రోల్ల నర్సయ్య అనారోగ్యంతో 2003లో అమరుడయ్యారు. . భార్య దుర్గవ్వ వ్యవసాయ కూలిగా జీవనం సాగించారు. 2018 అక్టోబర్ 17న కన్నుమూశారు. తాపీ మేస్త్రి గా జీవన సాగిస్తూ వైద్యం చేయించుకునే ఆర్థిక పరిస్థితులు లేక నర్సయ్య కొడుకు ఆనందం 2020లో అనారోగ్యంతో కన్నుమూశారు. మానవియ విలువలలు నమ్మిన సిద్ధాంతమే ఆస్తిపాస్తులుగా భావించి జీవించిన ఆ తరరానికి ప్రతినిధి తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, ఉమ్మడి సిరిసిల్ల మాజీ శాసనసభ్యులు, ప్రజా నాయకులు కర్రోల్ల నర్సయ్య జీవితం భవిష్యత్ చరిత్రకు వారధి లాంటిది. భవిష్యత్ తరాలకు తన వారసత్వాన్ని అప్పచెప్పుతూ ఆయన మనవడికి ముద్దుగా పెట్టుకున్న పేరు లెనిన్. కుటుంబానికి మిగిలింది పేదరికమే.  కర్రోల్ల నర్సయ్య నడిచిన "పోరు" దారిలో...

   * సిరిసిల్లలో 1935 లో జరిగిన ఆంధ్ర మహాసభ..

నిజాం సంస్థానంలో అప్పటికి వాక్ స్వాతంత్రాన్ని అరికట్టేందుకు నిశాన్ గస్తి శాసనం అమల్లో ఉంది. 1930 ప్రాంతంలో నిషాన్ గస్తీ చట్టాన్ని రద్దు చేయాలని , నిర్బంధ విద్య అమలు చేయాలని, ఎక్కువగా పాఠశాలలు తెరవాలని ఆనాడు మెదక్ జిల్లా జోగిపేటలో ఆంధ్ర మహాసభ తీర్మానం చేసింది. ప్రజలను జాగృతం చేస్తూ ముందుకు సాగుతున్న కాలం. నాలుగవ ఆంధ్ర మహాసభ 1935 సెప్టెంబర్ 6న సిరిసిల్లలో గాలిపెల్లి పోరు బిడ్డ బద్దం ఎల్లారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న అమృత్ లాల్ శుక్ల మహాసభల నిర్వహణ కోసం చురుకుగా పనిచేశారు. అనంతకాలంలో సిరిసిల్ల పాత తాలూకా పరిధిలో ప్రజలను చైతన్యవంతం చేయడం కోసం ప్రజలతో మమేకమై పని చేశారు. ఈ ప్రభావం నుంచి ఈ ప్రాంతంలో ఎంతోమంది నాయకులు ఎదిగి వచ్చారు. పదవ ఆంధ్ర మహాసభలో నిర్మాణం పూర్తిగా కమ్యూనిస్టుల ప్రభావంలోకి వచ్చింది.

*1946_1951 సాయుధ పోరాట కాలం.

. భూమి, భూక్తి, విముక్తి లక్ష్యంతో సామాన్యులు సాయిదూమవుతున్న పోరాటంగా రూపు తీసుకుంది. అట్లా మొదలైన పోరాటంలోకి నిరుపేద దళిత కుటుంబాల నుంచి వచ్చిన నర్సయ్య చిన్న వయసులోనే సాయుధమయ్యాడు. అప్పటికి సిరిసిల్ల పాత తాలూకా పరిధిలో అమృత లాల్ శుక్ల సహచరునిగా పోరాట ప్రయాణం ప్రారంభించారు. సిరిసిల్ల పాత తాలూకా పరిధిలో అనేక గ్రామాల్లో కరువు దాడులు నిర్వహించారు.ఆనాడు ప్రజలను సాయుధం చేస్తూ అట్టడుగు వర్గాల్లోకి ఉద్యమాన్ని తీసుకువెళ్లడంలో నర్సయ్య కీలకంగా పనిచేశారు. అమృత లాల్ శుక్ల దళం చేసిన అనేక దాడుల్లో ముందు వరుసలో ఉండేవారు. అమృత్ లాల్ శుక్ల నాయకత్వంలో మానాల అడవుల్లో నిర్వహించిన గేరిల్ల శిక్షణ తరగతులు సానపట్టి ఆయనను గేరిల్ల యోధుడిగా మలిచాయి. నర్సయ్య అనంతరం జరిగిన అనేక పోరాటాల్లోచురుకుగా పనిచేశారు.

సిరిసిల్ల పోలీస్ స్టేషన్ పై 1950 జూన్ 10వ తేదీన అమృత్ లాల్ శుక్ల గేరిల్ల దళాలు దాడి చేసిన సంఘటన సిరిసిల్ల పాత  తాలూక ప్రజలు తీవ్ర ప్రభావం చూపింది. ప్రజలపై మరింత అణిచివేత పెరిగింది అప్పట్లో ప్రజలు కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో పోరాటానికి సిద్ధమవుతున్న కాలం. ఆ నేపథ్యంలోనే మానాల అటవీ ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీ ట్రైనింగ్ క్యాంప్ ఏర్పాటు చేసింది. ట్రైనింగ్ క్యాంపులో మిల్ట్రీ శిక్షణ, రాజకీయ శిక్షణ తరగతులు ఎందరో యువకులతో పాటు నర్సయ్య ప్రజల కోసం తయారు చేశాయి. ఆనాటి పరిస్థితుల్లో కర్రోల్ల నర్సయ్య పెత్తందార్ల గుండెల్లో వణుకు పుట్టించి ప్రజలకు ప్రియమైన నాయకుడయ్యారు. కమ్యూనిస్టు దళాలు అనేక గ్రామాలను చైతన్యవంతం చేస్తు ముందుకు సాగుతున్నది. అనేక పోరాటాలు జరిగాయి. ప్రధానంగా నిమ్మ పెల్లి పోలీసు క్యాంపుపై 1945 ఆగస్టు 15 జరిగిన దాడిలో అమృతలాల్ శుక్లాతోపాటు నరసయ్య ముందు వరుసలో ఉన్నాడు. గర్జనపల్లి, వీర్నపల్లి, రుద్రంగి ప్రాంతాల్లో పోలీసు క్యాంపులపై జరిగిన దాడుల్లో కీలకంగా పనిచేశారు. ఆనాడు ప్రజల కోసం చేసిన కరువు దాడులతో పాటు అనేక భూ పోరాటాల్లో ప్రజల పక్షాన ముందు వరుసలో నిలబడి నర్సయ్య పోరాడారు. 1951 అక్టోబర్ 21వ తేదీన తెలంగాణ సాయుధ పోరాటం విరమించబడింది.

  * 1952 తొలి శాసనసభ ఎన్నికల్లో..

  భారత కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ సాయుధ పోరాట విరమణ అంతరం ఆంధ్ర ప్రదేశ్ కు జరిగిన తొలి శాసనసభ ఎన్నికల్లో అప్పుడున్న పరిస్థితిలో ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ పిడిఎఫ్ పేరుతో ఎన్నికల్లోకి అడుగు పెట్టింది. తొలి ఎన్నికల్లో సిరిసిల్ల నుంచి పిడిఎఫ్ అభ్యర్థి జోగినిపల్లి ఆనందరావు ఘనవిజయం సాధించారు. 1957లో రెండవసారి జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి సిరిసిల్ల నియోజకవర్గం నుంచి సిరిసిల్ల అభ్యర్థిగా కామ్రేడ్ అమృతలాల్ శుక్ల, నేరెళ్ల ఎస్సీ నియోజకవర్గం నుంచి కర్రోల్ల నర్సయ్య ఎన్నికయ్యారు. సమాజంలో అనేక వివక్షలను ఎదుర్కొన్న నర్సయ్య చదువు లేకపోవడంతో వివక్షకు గురయ్యారు. పట్టుదలతో చదవడం రాయడం నేర్చుకుని ఈ ప్రాంత ప్రజల సమస్యలపై అసెంబ్లీలో తన గళం వినిపించారు. అనంతరం మూడవసారి 1967లో జరిగిన ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. ఓటమికి అనేక కారణాలు ఉన్నట్లు అప్పట్లో చర్చ జరిగినట్లు ఆ తరం నాయకులు చెబుతుంటారు. పదవి కోసం కాకుండా ప్రజల కోసమే పనిచేసే నర్సయ్య ఎప్పుడు తను నమ్మిన సిద్ధాంతం పట్ల నమ్మకం వీడకుండా ప్రజల కోసమే పనిచేశారు. గంభీరావుపేట్ మండలం మొదలుకొని అటు రుద్రంగి చివరి వరకు ఇటు గర్జనపల్లి వీర్నపల్లి ప్రాంతాలు మొదలుకొని నిజామాబాద్ జిల్లా సరిహద్దుల వరకు కామ్రేడ్ కర్రోల్ల నర్సయ్య ప్రజలకు అండగా నిలబడ్డారు. అట్టడుగు వర్గాల నిరుపేద కుటుంబాలకు భూములు అందేలా శాసనసభ్యుడిగా ప్రజా నాయకుడిగా కృషి చేశారు.

 * ఎనగంటి...

ఇప్పటి వేములవాడ నియోజకవర్గంలోని చందుర్తి మండలంలో ఉన్న ఎనగంటి గ్రామం అప్పుడు సిరిసిల్ల పాత తాలూకా పరిధిలో ఉండేది. గ్రామంలో 100 ఎకరాల పైగా భూములు అణగారిన వర్గాలు ప్రజలకు పార్టీ పంచింది. భూములు అర్హులకు చెందేందుకు కర్రోల్ల నర్సయ్య పేత్తందారులకు ఎదురు నిలబడ్డారు. కులం పేరుతో అవమానపరిచిన పెత్తందారులు కర్రోల్ల నరసయ్య పై దొంగ చాటుగా దాడికి తెగబడ్డారు. తీవ్రంగా గాయపడ్డ నర్సయ్యను ప్రజలు వైద్యం కోసం తరలించి కాపాడారు. ఈ విషయంలో కర్రోల్ల నర్సయ్య గురించి పూర్తిగా తెలుసుకున్న పెత్తందారులు గ్రామస్తులు తీవ్రంగా చింతించినట్లు ఇప్పటికీ వృద్ధులు చెబుతుంటారు. నర్సయ్యకు డప్పు చప్పులతో స్వాగతం పలికి క్షమాపణలు చెప్పి గ్రామంలో భారీ సభ నిర్వహించి హెచ్ఎంటి వాచ్ ప్రేమతో బహుమతిగా ఇచ్చిన విషయం ఆ సంఘటన అప్పట్లో నర్సయ్య లాంటి నాయకులకు ప్రజల్లో ఉన్న ప్రేమను తెలియజేస్తుంది. గంభీరావుపేట్, మండలం నుంచి మొదలుకొని ఎల్లారెడ్డిపేట్, తంగళ్ళపల్లి, చందుర్తి, రుద్రంగి, మండలంలో వేలు ఎకరాలలో పేదలకు భూములు అందించడంలో నర్సయ్య ముందుండి పనిచేశారు. అనేక దళిత కుటుంబాలకు భరోసాను కల్పించారు. భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో భూ పోరాటాలు నిర్వహించడమే కాక పట్టాలు అందించడంలో కీలకంగా పనిచేశారు.

* అట్టడుగు వర్గాల్లో తొలితరం ఉద్యోగులు రావడం వెనుక..

   బడి కెళ్ళి తాను చదువుకోకపోయినా చదువు విలువ తెలుసుకున్న నర్సయ్య అట్టడుగు వర్గాల పిల్లలు చదువుకోవడం కోసం ఎంతో ప్రేరణ అందించారు. సిరిసిల్ల పాత తాలూకా పరిధిలో అట్టడుగు వర్గాల నుంచి ఆనాడు తొలి తరం ఉద్యోగులుగా అనేక రంగాల్లోకి వచ్చిన వాళ్లకు నర్సయ్య ఇచ్చిన ప్రోత్సాహమే కారణం. అప్పటి నుండి కర్రోళ్ల నర్సయ్య మల్కాపేట్ నుంచి ఇప్పటి సిరిసిల్ల వేములవాడ నియోజకవర్గాలలో సైకిల్ పై గ్రామాలలో చుట్టివచ్చారు. ప్రజలకు సమస్య ఎక్కడ ఉంటే అక్కడే ప్రత్యక్షమై ముందు వరసలో నిలబడేవాడు. సిరిసిల్ల పట్టణంలోని బి వై నగర్ కార్మిక వాడ నిర్మాణంలోనూ కర్రోల్ల నర్సయ్య ప్రత్యక్షంగా పాల్గొన్నారు. వేల కుటుంబాల్లో వెలుగులు నింపిన ఆయన కటిక పేదరికలోనే కన్నుమూశారు. తాను చీకట్లో ఉండిపోయిన సమాజానికి వెలుగు "తోవ్వ" ఇచ్చిపోయారు.✊✊✊✊

అల్లే రమేష్. జర్నలిస్ట్, సిరిసిల్ల

👇👇ప్రజలు కోరుతున్నది…..

 *మల్కాపేట్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కు కర్రోల్ల నర్సయ్య పేరు పెట్టాలి.

*, కర్రోల్ల నర్సయ్య కాంస్య విగ్రహాన్ని సిరిసిల్ల పట్టణం లోనిచంద్రంపేట్ చౌరస్తాలో ఏర్పాటు చేయాలి.

  • త్యాగపూరితమైన స్ఫూర్తినిచ్చే కర్రోల్ల నర్సయ్య జీవితాన్ని పాఠ్యపుస్తకాలు చేర్చాలి.👆👆

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here