- విద్యకు అరకొర నిధులు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై దాసోజు శ్రవణ్ ఫైర్
- రైసింగ్ తెలంగాణ కాదు… ఫాలింగ్ తెలంగాణ..
- యంగ్ ఇండియా స్కూల్స్ పేరుతో ప్రజలకు మోసం..
- విద్యపై ఖర్చు కాదు… పెట్టుబడిగా చూడాలి.. ప్రభుత్వ బడులకు నిధులు లేవు.. ప్రైవేట్ బడులపై నియంత్రణ లేదు..
- నిజాయితీ లేదు… నిధులు లేవు… నియంత్రణ లేదు..
- రెండున్నరేళ్లయినా విద్యా పాలసీ లేదు.. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం
- విద్యకు 20% బడ్జెట్ కేటాయించాలి.. పేద విద్యార్థులపై చిత్తశుద్ధి లేని ప్రభుత్వం..
- మెస్సీ, బ్యూటీ షోలకి బడ్జెట్… విద్యకు నిధుల్లేవు..
– ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్
బలగం టీవీ, హైదరాబాద్:
బాలల హక్కుల పరిరక్షణ వేదిక–తెలంగాణ ఆధ్వర్యంలో, సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విద్యకు 20 శాతం బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం విద్య రంగానికి అరకొర నిధులు మాత్రమే కేటాయిస్తూ తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ఇది “రైసింగ్ తెలంగాణ కాదు… ఫాలింగ్ తెలంగాణ” అని వ్యాఖ్యానించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరుతో ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని అన్నారు.
విద్య, వైద్య రంగాలపై ప్రభుత్వం వెచ్చించే ఖర్చులను వ్యయంగా చూడకూడదని, అవి రాష్ట్ర భవిష్యత్తుకు పెట్టుబడులుగా భావించాలని దాసోజు శ్రవణ్ స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి అవసరమైన నిధులు లేకుండా పోయాయని, మరోవైపు ప్రైవేటు పాఠశాలలపై ఎలాంటి నియంత్రణ లేకపోవడంతో విచ్చలవిడితనం పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ బడులకు నిధులు లేకపోవడం, ప్రైవేటు బడులపై నియంత్రణ లేకపోవడం వల్ల విద్య రంగం గందరగోళ స్థితికి చేరుకుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పే ప్రజాపాలన, పారదర్శకత కేవలం మాటలకే పరిమితమైందని, హామీలు నెరవేర్చకుండా దాటవేత ధోరణిని అవలంబిస్తోందని విమర్శించారు.
ప్రభుత్వానికి నిజాయితీ లేదని, అందుకే కేంద్రం నుంచి నిధులు రావడం లేదని ఆయన ఆరోపించారు. నిజాయితీ లేకపోవడం, నిధుల కొరత, నియంత్రణ లేకపోవడం కలిసి విద్య రంగంలో విచ్చలవిడితనానికి దారితీస్తున్నాయని అన్నారు.
మార్పు అని చెప్పే కాంగ్రెస్ నాయకులు, ఆ మార్పుకు తగిన విధంగా ఒక స్పష్టమైన విధానాన్ని రూపొందించేందుకు సమయం ఇవ్వడం లేదని దాసోజు శ్రవణ్ విమర్శించారు. ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు గడిచినా ఇప్పటివరకు ఒక్క విద్యా విధానం కూడా రూపొందించకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు.
మెస్సితో ఫుట్‌బాల్ ఆడేందుకు, ప్రపంచ సుందరి పోటీలు నిర్వహించేందుకు బడ్జెట్ కేటాయించే ప్రభుత్వం, విద్య రంగానికి మాత్రం తగిన నిధులు కేటాయించడం లేదని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో ఎమ్మెల్సీ కాకపోయినా అజారుద్దీన్‌ను మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించిన ప్రభుత్వం, ప్రొఫెసర్ కోదండరామ్‌కు విద్యాశాఖ మంత్రిగా అవకాశం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
ప్రొఫెసర్ కోదండరామ్‌ను విద్యాశాఖ మంత్రిగా నియమిస్తే వచ్చే నష్టం ఏమిటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదని విమర్శించారు.
సీఎం రేవంత్ రెడ్డి వేల కోట్లు ఖర్చు చేసి హార్డ్‌వేర్ యూనివర్సిటీలో తరగతులకు హాజరవుతున్నారని, కానీ రాష్ట్రంలోని పేద విద్యార్థుల కోసం మాత్రం తగిన నిధులు కేటాయించడం లేదని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్రంగా విమర్శించారు.

