వరి ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం..

0
32

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు మెంగని మనోహర్

ముస్తాబాద్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు మెంగని మనోహర్, బీఆర్ఎస్ పార్టీ యూత్ మండల అధ్యక్షుడు శీలం స్వామి ఈరోజు విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం వడ్ల కొనుగోలు కేంద్రాలను ఆలస్యంగా ప్రారంభించడం వల్ల దాదాపు 40 శాతం ధాన్యాన్ని దళారులు కొనుగోలు చేసే పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. దీని ద్వారా దళారీ వ్యవస్థను ప్రోత్సహించినట్లు స్పష్టమవుతోందని వారు అన్నారు. ప్రభుత్వం కొనుగోళ్లు ప్రారంభించిన నాటి నుండి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటివరకు ఎంత ధాన్యం కొనుగోలు చేసిందో, ఎంత మొత్తానికి రైతులకు డబ్బులు చెల్లించిందో అధికారికంగా వెల్లడించడం లేదని వారు ప్రశ్నించారు. ఈ విషయంలో ప్రభుత్వం దాచిపెడుతున్న ఆంతర్యం ఏమిటో రైతులకు, ప్రజలకు చెప్పాలని వారు డిమాండ్ చేశారు.

మొదట్లో కొనుగోలు చేసిన వడ్లను గోదాములకు తరలించినా, రైతులకు డబ్బులు సక్రమంగా చెల్లించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని వారు తెలిపారు. తర్వాత కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు పంపారని, ఆ లెక్కలను కూడా ప్రభుత్వం చెప్పాలని వారు కోరారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా కొనుగోలు చేసిన మొత్తం ధాన్యం, రైతులకు చెల్లించిన డబ్బులు, గోదాముల్లో భద్రపరిచిన ధాన్యం వివరాలను బహిర్గతం చేయాలని వారు డిమాండ్ చేశారు.

రైతులందరికీ కొనుగోలు చేసిన వడ్ల డబ్బులను మూడు నాలుగు రోజుల్లో చెల్లించాలని, లేనిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన ఉద్యమిస్తుందని వారు హెచ్చరించారు. ప్రతిరోజు సాయంత్రం కురుస్తున్న వర్షాలకు ధాన్యం తడుస్తూ, ఎండకు మళ్లీ ఎండిపోతూ మొలకెత్తుతున్న పరిస్థితి ఉందని, తడిసి మొలకెత్తిన ప్రతి గింజను కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పరిస్థితి ఇలానే ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

వడ్ల కొనుగోలు బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించి ప్రభుత్వం చేతులు దులుపుకుందని, సమస్యలు వచ్చినప్పుడు ప్రభుత్వ పెద్దలు గానీ, కాంగ్రెస్ నాయకులు గానీ వారికి అండగా నిలవడం లేదని వారు విమర్శించారు. కొన్ని కొనుగోలు కేంద్రాల్లో కాంగ్రెస్ నాయకులు మహిళా సంఘాల ప్రతినిధులను బెదిరిస్తున్నారని మహిళలు ఆవేదన చెందుతున్నారని వారు తెలిపారు.

ఇకనైనా ప్రభుత్వం స్పందించి ధాన్యం కొనుగోలు డబ్బులను రైతుల ఖాతాల్లో వేయాలని, నాలుగు రోజుల్లో మొత్తం కొనుగోళ్లు పూర్తి చేయాలని, అలాగే ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన అధికారిక లెక్కలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తుందని వారు స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నల్ల నరసయ్య, మాజీ మండల కో-ఆప్షన్ సభ్యులు ఎస్కే అన్వర్, యండి. జహంగీర్, నాయకులు కోడె శ్రీనివాస్, పల్లె సత్యం, కంచం నర్సింలు, శేఖర్ చారి, మొలిగె మహేందర్, ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here