కాంగ్రెస్ అంటేనే మోసం..‌ -మాజీ సర్పంచుల JAC రాష్ట్ర అధ్యక్షుడు

0
224

తాజా మాజీ సర్పంచులకు రావాల్సిన పెండింగ్ బిల్లులు అధికారంలోకి వచ్చిన వెంటనే విడుదల చేస్తామని చెప్పి మోసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

  • మాజీ సర్పంచుల JAC రాష్ట్ర అధ్యక్షుడు అక్కెనపెల్లి కరుణాకర్

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

చొప్పదండి మాజీ శాసనసభ్యులు సుంకే రవి శంకర్ నాయకత్వంలో బిఆర్​ఎస్​ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్​ సమక్షంలో తిరిగి BRS పార్టీ సొంతగూటికి చేరుకున్న తాజా మాజీ సర్పంచుల JAC రాష్ట్ర అధ్యక్షులు అక్కెనపెల్లి కరుణాకర్.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మాజీ సర్పంచులకు రావాల్సిన పెండింగ్ బిల్లులను విడుదల చేస్తామని హామీ ఇచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసం చేశారని ఆరోపిస్తూ, తాజా మాజీ సర్పంచుల JAC రాష్ట్ర అధ్యక్షులు అక్కెనపెల్లి కరుణాకర్ తిరిగి BRS పార్టీలో చేరారు. చొప్పదండి మాజీ శాసనసభ్యులు సుంకే రవి శంకర్ గారి నాయకత్వంలో, BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఈ చేరిక జరిగింది.

ఈ సందర్భంగా అక్కెనపెల్లి కరుణాకర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడిగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక తుంగలో తొక్కారని విమర్శించారు. సర్పంచులు తమ పెండింగ్ బిల్లులు కోరితే, “ఇవి మా కాంగ్రెస్ పార్టీ హయాంలో చేసిన అభివృద్ధి పనులు కావు” అని చెప్పి మాట మార్చారని ఆరోపించారు. మాట మార్చిన ముఖ్యమంత్రిపై ఒత్తిడి తీసుకురావడంతో, ఉద్యమం చేస్తున్న సర్పంచులను అక్రమంగా అరెస్టులు చేసి తీవ్రంగా ఇబ్బందులకు గురి చేశారని పేర్కొన్నారు.

“కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో గ్రామ ప్రథమ పౌరులకే ఇలాంటి పరిస్థితి ఉందంటే రాష్ట్రంలో సాధారణ ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉందో కళ్ళకు కట్టినట్టు అర్థమవుతుంది,” అని కరుణాకర్ అన్నారు. సర్పంచులకు పెండింగ్ బిల్లులు ఇవ్వమని అడిగితే, “మీరు ఏమైనా మా హయాంలో చేసినారా?” అంటూ అవగాహనారాహిత్యంతో, కక్ష సాధింపుతో మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గతంలో జరిగిన అభివృద్ధి పనులను గుర్తుంచుకోవాలని హితవు పలికారు. సర్పంచులు చేసిన అభివృద్ధి పనులు ప్రజల కోసమే తప్ప ఎవరి స్వలాభానికి కాదని గుర్తు చేశారు. అదేవిధంగా, మీరు అధికారంలోకి రాకముందు చేసిన పనులకు మేమెందుకు బిల్లులు చెల్లించాలని మూర్ఖత్వపు ఆలోచనతో మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి, గత ప్రభుత్వంలో నిర్మించిన రాష్ట్ర సచివాలయం, జిల్లాల వారీగా సమీకృత కార్యాలయాలు, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ వంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వినియోగిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. “అలాంటప్పుడు గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి ప్రభుత్వ కార్యాలయాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత మీరు కూర్చొని పరిపాలన చేస్తలేరా అని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం,” అని ఆయన అన్నారు.

కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి ప్రజలను మోసం చేసే పార్టీ అని, సర్పంచులకు రావాల్సిన పెండింగ్ బిల్లులను విడుదల చేయకుండా, అబద్ధపు ఆరు గ్యారెంటీలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని కరుణాకర్ దుయ్యబట్టారు. నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగములు, పింఛన్లు పెంచుతామని చెప్పి మరెన్నో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, సంక్షేమ పథకాలను అమలు చేయాలంటే ఉద్యమ పార్టీ అయిన BRS తోనే సాధ్యమవుతుందని ప్రజలకు వివరించారు. ప్రజలకు రావాల్సిన ఆరు గ్యారెంటీలు మరియు సర్పంచులకు రావాల్సిన పెండింగ్ బిల్లులు విడుదల చేసేంతవరకు BRS పార్టీలోనే ఉండి పోరాటం చేస్తామని, అందుకే తిరిగి BRS పార్టీలో చేరానని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో 20 నెలల వ్యవధిలోనే దాదాపుగా 2 లక్షల కోట్లు అప్పు చేసిన రేవంత్ రెడ్డి సర్కార్ కేవలం సర్పంచులకు రావాల్సిన 1000 కోట్లు ఇవ్వమంటే మాత్రం రాష్ట్రం దివాలా తీసిందని మాట్లాడటం కేవలం తాజా మాజీ సర్పంచులపై కక్ష్య సాధింపు అని ఈ సందర్భంగా తాము తెలియజేస్తున్నామని కరుణాకర్ పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకుల బిల్లులు, మంత్రుల బిల్లులు చెల్లించడానికి డబ్బులు ఉన్నాయని, కానీ సర్పంచులకు ఇవ్వమంటే మాత్రం డబ్బులు లేవని, సర్పంచ్ల ఉద్యమాన్ని, సర్పంచులను అణిచివేసి పోలీసులచే చిత్రహింసలు పెట్టిస్తున్న రేవంత్ రెడ్డి సర్కారును స్థానిక సంస్థలలో కచ్చితంగా ఓడించి తీరుతామని హెచ్చరించారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులమందరం ఏకమై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాన్ని మరొక్కసారి ప్రజలకు గుర్తు చేస్తూ, మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ పార్టీని స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలిచి కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. భవిష్యత్తులో సర్పంచులందరూ కార్యచరణ రూపొందించుకొని, ఆరు గ్యారెంటీ ల పేరుతో రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేస్తున్న తీరును నిరంతరం ప్రజలకు వివరిస్తూ, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బొంద పెడతామని హెచ్చరించడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here