మున్సిపల్ ఎన్నికల పేరుతో కాంగ్రెస్ మరోసారి మోసం చేయబోతోంది..

0
43

– చేతిలో అధికారం ఉన్నా కేసీఆర్‌ను తిట్టడమే సిఎం పని

– జిల్లాలు ఎత్తివేయాలనే కుట్రకు ప్రజలు బుద్ధి చెప్పాలి..

  • బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయకుండా, మున్సిపల్ ఎన్నికల పేరుతో కాంగ్రెస్ పార్టీ మరోసారి ప్రజలను మోసం చేయడానికి సిద్ధమవుతున్నదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ అన్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా గురువారం సిరిసిల్ల పట్టణంలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్బంగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతుబంధు వేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతున్నారని, అయితే ఇప్పటివరకు ఎన్ని పంట కాలాలు గడిచాయో, ఎన్ని సార్లు రైతుబంధు రైతుల ఖాతాల్లో వేసారో చెప్పాలని, ఎన్నికలకు రైతుబంధు వేయడానికి అడ్డంకి ఏంటని ప్రశ్నించారు. కేవలం ఎన్నికలు పూర్తయ్యేంత వరకే ఆశ చూపించి, మరోసారి రైతులను మోసం చేయడానికే ఈ హామీలు ఇస్తున్నారని అన్నారు.

ఎన్నికల ముందు అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలను కూడా పక్కన పెట్టిందని అన్నారు . ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదని, ప్రజలను పూర్తిగా మోసం చేస్తోందని, మరోసారి కాంగ్రెస్ మాటలు నమ్మి ఓటు వేస్తే ప్రజలు మళ్లీ మోసపోవడం ఖాయమని అన్నారు.చేతిలో అధికారం, అవకాశం ఉన్నప్పటికీ గత ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని,చేతనైతే ప్రజలకు మంచి చేయాలి, హామీలు అమలు చేయాలే తప్ప, కేసీఆర్‌ను విమర్శించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. గత రెండు ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క మంచి పని కూడా చేయలేదని అన్నారు.

కేసీఆర్ ఏర్పాటు చేసిన చిన్న జిల్లాలను ఎత్తివేయాలనే కుట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందని  ఆరోపించారు. జిల్లాలను రద్దు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ మాటలను గుర్తు పెట్టుకుని ఓటు వేయాలని ,జిల్లా కేంద్రాల రద్దు మంచా, చెడ్డా అన్నది ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని అన్నారు. ఈ మున్సిపల్ ఎన్నికలు గత పది సంవత్సరాలుగా ప్రజలకు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అందించిన పార్టీకి, మరియు రెండు సంవత్సరాల్లోనే ఉన్న పథకాలను రద్దు చేసిన కాంగ్రెస్ పార్టీకి మధ్య పోటీ అని, కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తేనే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తిరిగి ప్రారంభమవుతాయని, ఆ దిశగా ఈ మున్సిపల్ ఎన్నికల నుంచే ఉద్యమం ప్రారంభించాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను నిలదీయకపోతే, ఇచ్చిన హామీలపై ప్రశ్నించకపోతే, మరో మూడు సంవత్సరాల పాటు శాసనసభ ఎన్నికల వరకు ప్రజలకు ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం ఉండదని  అన్నారు. ఇప్పుడే హెచ్చరిక జారీ చేసేలా ఓటు వేయకపోతే కాంగ్రెస్ తన మోసాలను కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here