– ప్రభుత్వం వద్ద పైసలేదని సీఎం ఒప్పుకుండు.. మరి అభివృద్ధి ఎట్లా చేస్తాడు.?
– కేటీఆర్ నీ అరాచకాలు, నీ నీచ పనులన్నీ బయటపెడతా..
- కేంద్రమంత్రి బండి సంజయ్.
బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
ఫిరాయింపుల విషయంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యభిచారం చేస్తోందని , పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పష్టమైన ఆధారాలున్నా, ఆధారాల్లేవంటూ శాసనసభ స్పీకర్ ఫిరాయింపుల కేసులను కొట్టివేయడం దుర్మార్గమని, ఇలాంటి తీర్పులతో ప్రజాస్వామ్యం అపహాస్యమవుతోందని, రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవిపై మచ్చ పడుతోందని,కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బుధవారం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిరిసిల్ల, వేములవాడ పట్టణాలలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లకి కేంద్రమంత్రి బండి సంజయ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ‘‘స్పీకర్ సార్… మీరు నిజాయితీ పరులు. కానీ మీపై కాంగ్రెస్ ఒత్తిడి తెస్తోందని, ఫిరాయింపు ఎమ్మెల్యేలు గాంధీభవన్‌లోనే సంసారం చేస్తున్నారని, జిల్లా కాంగ్రెస్ కార్యాలయాల్లో సమావేశాలు పెడుతు, వాళ్ల చేతికే బి.ఫాంలు ఇస్తున్నారని అన్నారు. ఇవన్నీ కళ్ల ముందే జరుగుతున్నా పార్టీ మారలేదని కేసులు కొట్టివేయడం ప్రజాస్వామ్యానికి ద్రోహం అని,ఇలాంటి తీర్పులతో చరిత్రలో మీరు మసకబారిపోతారు’’ అని అన్నారు.
ఫిరాయింపు ఎమ్మెల్యేలను నిలదీయండి
‘మీ నియోజకవర్గానికి వచ్చే ఎమ్మెల్యేలను నిలదీయండని, మీరు ఏ పార్టీ తరపున వచ్చారు, ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేయాలి, ఏ అభ్యర్థిని గెలిపించాలి, ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీ కండువా కప్పుకుని మళ్లీ ఎందుకు ఓట్లు అడుగుతున్నారు’ అని ప్రశ్నించాలని పిలుపునిచ్చారు.
సిరిసిల్లలో అభివృద్ధి శూన్యం
సిరిసిల్ల మున్సిపాలిటీకి బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగలేదని ఆరోపించారు. వర్షం వస్తే గల్లీలన్నీ మునిగిపోతున్నాయని, చివరకు జిల్లా కలెక్టరేట్ కూడా నీళ్లలో మునిగిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. మురుగు నీటి శుద్ధి ప్లాంట్ పేరిట ఎస్‌టీపీ నిర్మాణం వల్ల గ్రామాల్లోకి మురుగు నీళ్లు వస్తున్నాయని అన్నారు.వస్త్ర పరిశ్రమ మొత్తం సిరిసిల్లలో ఉంటే,నూలు (యారన్) డిపోను వేములవాడలో పెడతారా ఎవరైనా, డిపో ఈడ పెడితే వాళ్ల కమీషన్లన్నీ తెలుస్తదని ఆడ పెట్టిర్రు అని, ప్రతి కిలో పై కాంగ్రెస్ నేతలు కమిషన్లు తీసుకుంటున్నారని అన్నారు. టెక్స్టైల్ పార్క్ పూర్తిగా నిర్వీర్యమైందని, 220 యూనిట్లు ఉండాల్సిన చోట కేవలం పది షెడ్లలోనే పని జరుగుతోందని అన్నారు . నేత కార్మికులకు ఉపాధి కల్పించడంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని అన్నారు. ఏడు శివారు గ్రామాలను బలవంతంగా సిరిసిల్ల మున్సిపాలిటీలో విలీనం చేసి, ప్రజలకు ఉపాధి హామీ లేకుండా చేశారని అన్నారు. విలీనాన్ని రద్దు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ హామీని విస్మరించిందన్నారు. పైగా ఇంటి పన్నులు, ఇతర ట్యాక్స్‌లు పెంచి ప్రజలపై భారం మోపిందని అన్నారు.
కేంద్ర నిధుల దుర్వినియోగం
14, 15వ ఆర్థిక సంఘాల ద్వారా సిరిసిల్లకు దాదాపు రూ.29 కోట్లు, అమృత్ పథకం ద్వారా రూ.50 కోట్లు, స్వనిధి ద్వారా రూ.21.52 కోట్లు, స్వచ్ఛ భారత్ ద్వారా రూ.44 లక్షలు కేంద్రం ఇచ్చిందని కానీ ఆ నిధులను సక్రమంగా వినియోగించకుండా కమిషన్లకు కరిగించారని ఆరోపించారు. ‘నిధులు ఇచ్చేది కేంద్రం, ప్రగతి మాది, కమీషన్లు వాళ్లవి, పైసలు మావి, సోకులు వాళ్లవి, ఇలాంటి వాళ్లకు మళ్లీ ఓట్లు వేస్తారా?’ అని ప్రశ్నించారు.
బిఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీలోకి రండి..
“మరి నువ్వేం చేశావు కేటీఆర్, మా కార్యకర్తలను కొట్టి జైలుకు పంపిస్తావా, బిడ్డా… నీ సంగతి చూస్తా అని,తాను ప్రజల చేత 2.26 లక్షల ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందానని,ప్రజలు నీకంటే నాపైనే ఎక్కువ నమ్మకం ఉంచారు అని అన్నారు. మళ్లీ వచ్చి ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే కేటీఆర్ బండారం అంతా బయటపెడతానని హెచ్చరించారు. ఇటీవల భారీ వర్షాలతో పేద ప్రజలు ముంపునకు గురైతే, వారిని కాపాడే సోయి కేటీఆర్‌కు ఉందా? అని ప్రశ్నించారు. నేను స్వయంగా హెలికాప్టర్ తెచ్చి ముంపు బాధితులను రక్షించాను. కేంద్రం నుంచి నిధులు తెచ్చి ప్రజల కోసం కష్టపడ్డాను అన్నారు. కేటీఆర్ మాత్రం కేంద్ర నిధులను దారి మళ్లించి కమీషన్లు దోచుకున్నారని ఆరోపించారు. ప్రజల కష్టాలు పట్టించుకోని నాయకత్వమే బీఆర్ఎస్ అని అన్నారు.మీ కష్టాలను బీఆర్ఎస్ పట్టించుకోదు. ఎన్నికల్లో మిమ్మల్ని ఆదుకునే పరిస్థితి ఆ పార్టీకి లేదని, కష్టమొస్తే ఆదుకునేది బీజేపీనే, నేను మీకు అండగా ఉంటా, బీజేపీలోకి రండిని బీఆర్ఎస్ కార్యకర్తలకి పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏ హామీ అమలు చేయలేదు
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఏది ఒకటి అమలు కాలేదని అన్నారు. మహిళలకు రూ.2,500 ఆర్థిక సహాయం, తులం బంగారం, స్కూటీ,?అవ్వా–తాతలకు రూ.4 వేల పెన్షన్ ఇవ్వలేదని అన్నారు. నన్ను కోసినా నయాపైసా ప్రభుత్వ ఖజానాలో లేదని సీఎం రేవంత్‌రెడ్డే చెప్పాడు. మరి అభివృద్ధి కోసం నిధులు ఎక్కడి నుంచి తెస్తారు అని ప్రశ్నించారు. నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమేనని, వాటిని రాష్ట్రానికి తెచ్చేది తామేనని, సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీని బీజేపీకి అప్పగిస్తే పెద్ద ఎత్తున నిధులు ఇస్తామని,ప్రధాని నరేంద్ర మోదీ భరోసా ఇచ్చారని అన్నారు. లేనిపక్షంలో కేంద్రం ఇచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించే ప్రమాదం ఉందని ఆరోపించారు.
బీజేపీ రాజకీయ వ్యభిచారం చేయదు
‘బీజేపీ ఇతర పార్టీల మాదిరిగా రాజకీయ వ్యభిచారం చేయదు. మా పార్టీలోకి రావాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సిందే అని ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన తర్వాతే పార్టీలోకి వచ్చారు’ అని అన్నారు .మున్సిపాలిటీని బీజేపీకి అప్పగిస్తే కేంద్రం నుంచి భారీగా నిధులు తీసుకొస్తా’’ అని హామీ ఇచ్చారు.
వేములవాడ ఎమ్మెల్యే బీజేపీ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తుండు..
వేములవాడ ఎమ్మెల్యే బీజేపీ కార్యకర్తలను బెదిరింపులకు గురిచేస్తున్నారని, స్థానిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ తరఫున నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆరోపించారు.మూడు సంవత్సరాలు తమదే అధికారమని చెప్పుకుంటూ పోలీసులను అడ్డుపెట్టుకుని కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని అన్నారు. మేం ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని చూస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ నేతల మాటలు విని శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తే మీరే ఇబ్బందుల్లో పడతారు. అవసరమైతే వేములవాడలోనే వచ్చి కూర్చుంటాం. అప్పుడు డీజీపీ, ఎస్పీలు ఇక్కడికే రావాల్సి ఉంటుంది అన్నారు.
రాజన్న ఆలయం నిర్మాణం ఆగమ శాస్త్ర ప్రకారం జరుగుతలే
వేములవాడలో ఆగమశాస్త్ర సంప్రాదాయాలను పాటించకుండా అడ్డగోలుగా నిర్మాణాలు చేపడుతున్నరని,.రాతితో కట్టాల్సిన ఆలయాన్ని సిమెంట్ కాంక్రిట్ తో కడుతున్నరని అన్నారు. ఎములాడ రాజన్నను దర్శించుకునే సమ్మక్క సారలమ్మ జాతర భక్తులు ఇబ్బందులు పడ్డారని అన్నారు. రెండేళ్ల పాలనలో నయాపైసా అయినా ఈ మున్సిపాలిటీకి ఇవ్వలేదని, ఇయ్యలే.. రెండేళ్లలో పైసా ఇయ్యనోడు… ఇగ మూడేళ్లలో ఏం చేస్తాడని అన్నారు.
బీఆర్ఎస్ పాపాలు అన్నీ ఇన్నీ కావు అని, రాజన్నను మోసం చేశారు, కాళేశ్వరం కూలింది, మల్లన్న సాగర్ దెబ్బతిన్నదని ఆ పాపాలన్నీ పెరిగినయ్ కాబట్టే బీఆర్ఎస్ ప్రభుత్వం కూలిందని అన్నారు. రాజన్నకే కేసీఆర్ శఠగోపం పెట్టిండని, గుడిని అభివ్రుద్ధి చేస్తానని మోసం చేసిండని అన్నారు. సిరిసిల్ల వేములవాడ మున్సిపాలిటీలో బిజెపి అభ్యర్థిని గెలిపించి మోడీకి కానుకగా ఇవ్వాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జ్ వికాస్ రావు, రాష్ట్ర అధికార ప్రతినిధి జె. సంగప్ప, బిజెపి సీనియర్ నాయకులు ప్రతాప రామకృష్ణ, జిల్లా నేతలు, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థులు పాల్గొన్నారు.

