ప్రజల విశ్వాసం గులాబీ జెండాపైనే — నడిగడ్డ స్ఫూర్తి రాష్ట్రానికి కావాలి.
మళ్లీ కేసీఆర్ నాయకత్వంలో గులాబీ జెండా ఎగురుతుంది.
తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ కౌన్సిలర్లకు సన్మానం — ఆలంపూర్ విజేతలకు కేటీఆర్ అభినందనలు.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
బలగం టీవీ, హైదరాబాద్:
ఆలంపూర్ నియోజకవర్గంలో విజయం సాధించిన తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన కౌన్సిలర్లను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామి రెడ్డి, ఎమ్మెల్యే విజయుడు తదితర ముఖ్య నేతలు పాల్గొననున్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఆలంపూర్, ఐజ, గద్వాల, వడ్డేపల్లి ప్రాంతాల్లో బీఆర్ఎస్‌కు ప్రజలు అందించిన మద్దతు విశేషమని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ నడిగడ్డలో మాత్రం ప్రజల విశ్వాసం ఇప్పటికీ బీఆర్ఎస్‌పైనే ఉందని పేర్కొన్నారు. సర్పంచ్ ఎన్నికల నుంచి మున్సిపల్ ఎన్నికల వరకు మెజారిటీ స్థానాలు గెలుచుకోవడం పార్టీ బలాన్ని నిరూపిస్తోందన్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం అరాచక పాలన నడుస్తోందని కేటీఆర్ విమర్శించారు. నాగర్‌కర్నూల్‌లో రెండు నెలల పాప మరణ ఘటన, కోదాడలో దళిత యువకుడు కర్ల రాజేష్ లాకప్ డెత్ వంటి ఘటనలు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. ఖమ్మం వెలుగుమట్లలో ఇళ్ల కూల్చివేతలు ప్రజలను రోడ్డున పడేసిన దారుణ చర్యలని ఆక్షేపించారు.
కేసీఆర్ నాయకత్వంలో గతంలో అభివృద్ధి, సంక్షేమం రెండు జోడెడ్లలా ముందుకు సాగాయని, కానీ ప్రస్తుతం రాష్ట్రంలో అవినీతి, అరాచకం జోడెడ్లుగా మారాయని ఆయన విమర్శించారు. చెక్ డ్యామ్‌లు పేల్చడం, పల్లె ప్రకృతి వనాల్లో చెట్ల నరుకులు వంటి చర్యలు రాష్ట్రాన్ని వెనక్కి నెడుతున్నాయని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని, రైతు బంధు, ఎరువుల సరఫరా వంటి అంశాల్లో రైతులను తీవ్రంగా నిరాశపరిచిందని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రజలకు ఇప్పుడు కాంగ్రెస్ నిజ స్వరూపం అర్థమైందన్నారు. నడిగడ్డ స్ఫూర్తి రాష్ట్రం మొత్తం వ్యాపించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ చల్ల వెంకట్రామి రెడ్డి ప్రజల సమస్యలపై అంకితభావంతో పనిచేసే నాయకుడని, ఎమ్మెల్యే విజయుడు కూడా అదే తత్వాన్ని కొనసాగిస్తున్నారని ప్రశంసించారు.
రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నాలు చేస్తుందని ముందుగానే హెచ్చరించిన కేటీఆర్, పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోసారి కేసీఆర్ నాయకత్వంలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.




