బలగం టీవీ, కొత్తగూడెం:
రాష్ట్రంలో దుష్టపాలన కొనసాగుతున్నదని, అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేరట్లేదని, పరిపాలన చేతగాక కాలయాపన చేస్తున్నారని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర చెప్పారు. కాంగ్రెస్ నాయకులు ఎన్నికలప్పుడు 432 వాగ్ధానాలు చేసి, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి తీరా అధికారంలోకి వచ్చాక మోసం చేశారని ఎంపీ రవిచంద్ర మండిపడ్డారు. ఎంపీ రవిచంద్ర మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు,ఆయన కుమారుడు రాఘవలతో కలిసి కొత్తగూడెం మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని 48వ డివిజన్ జగ్గుతండాలో గురువారం మధ్యాహ్నం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు మాట్లాడుతూ.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చట్టసభల్లో మహిళలు, బీసీలకు 33శాతం చొప్పున రిజర్వేషన్స్ కల్పించాలని కోరుతూ 2014 జూన్ 14వ తేదీన అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయాన్ని గుర్తు చేశారు. గిరిజనులకు ఉన్న 6% ఉన్న రిజర్వేషన్లను 10% శాతానికి పెంచిన మహానేత కేసీఆర్ అని కొనియాడారు.అదే రేవంత్ రెడ్డి పాలనలో బీసీలకు మాత్రమే కాకుండా గిరిజనులకు కూడా తీవ్ర అన్యాయం జరుగుతుందని,మున్నూరు కాపు,యాదవ్,రజక,లంబాడ వారికి మంత్రి పదవులు ఇవ్వలేదని ఎంపీ రవిచంద్ర పేర్కొన్నారు. కేసీఆర్ తండాలు,గుడేలను గ్రామ పంచాయతీలను చేసి గిరిజనుల ఆత్మగౌరవాన్ని మరింత పెంచారని చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చెందిన వారు తెలంగాణ నుంచి 8మంది ఎంపీలు ఉన్నప్పటికీ రాష్ట్రానికి నిధులు తీసుకు రావడంలో విఫలం చెందారని ఎంపీ వద్దిరాజు విమర్శించారు. కాంగ్రెస్ పాలకులు ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకపోగా,ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆయన మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టడమే కాక అన్ని విధాలా ప్రగతిపథాన పరుగులు పెట్టించిన కేసీఆర్ కు నోటీసులిచ్చి అవమానించిన రేవంత్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైనదని ఎంపీ రవిచంద్ర చెప్పారు. ఈ ఎన్నికల్లో కొత్తగూడెం మునిసిపల్ కార్పోరేషన్ ను కైవసం చేసుకుని కేసీఆర్ కు కానుకగా ఇద్దామని ఎంపీ వద్దిరాజు ఓటర్లను కోరారు.
అరాచక పాలనపై ప్రజలు విసిగిపోయారు: కొత్తగూడెం ప్రచారంలో ఎంపీ రవిచంద్ర
కాంగ్రెస్ సర్కార్ పనితీరుపై బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పదేళ్ల పాలనలో అన్ని రంగాలలో రాష్ట్రం గొప్పగా అభివృద్ధి చెందగా, కాంగ్రెస్ ప్రభుత్వంలో అధోగతి పాలవుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు.
ఎంపీ రవిచంద్ర గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కొత్తగూడెంలోని 10వ డివిజన్ బూడిదగడ్డ,58వ డివిజన్ హనుమాన్ బస్తీ,25వ డివిజన్ ఏ పవర్ హౌస్ బస్తీలలో విస్తృత ప్రచారం జరిపారు. ఎంపీ రవిచంద్ర మునిసిపల్ మాజీ ఛైర్ పర్సన్ కాపు సీతామహాలక్ష్మీ,మాజీ వైస్ ఛైర్మన్ వేల్పుల దామోదర్, అభ్యర్థులు వేల్పుల వీరమ్మ, ఏమునూరి శివకృష్ణ, వేముల ప్రసాద్ బాబు, నాయకులు కొట్టి వెంకటేశ్వర్లు, వేణుగోపాల్, నవతన్ తదితరులతో కాలినడకన వీధివీధి తిరిగి ఇంటింటికి వెళ్లి కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ కు ఘన విజయం చేకూర్చాల్సిందిగా ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు పలుచోట్ల ప్రజలను ఉద్దేశించి ఉత్తేజిత ప్రసంగం చేశారు, విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పాలకులు అభివృద్ధి,ప్రజా సంక్షేమానికి పూర్తిగా మర్చిపోయారని,ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని ఆందోళన చెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం అరాచక పాలన సాగుతున్నదని,ఇది కేసుల,పోలీసుల ప్రభుత్వం ఆయన వ్యాఖ్యానించారు.అక్రమ కేసుల బనాయింపు,విచారణలు బెదిరింపులు, అదిరింపులు, వేధింపులు, అరెస్టులకు భయపడబోమని,ప్రజలకు కొండంత అండగా కేసీఆర్ ఉన్నారని ఎంపీ రవిచంద్ర చెప్పారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ అని, పాలకుల పనితీరును ప్రజలు నిశితంగా గమనిస్తున్నారన్న విషయాన్ని డీజీపీ శివధర్ రెడ్డి గుర్తించుకుంటే మంచిదన్నారు. ప్రజలు కేసీఆర్ రెండేళ్ల పాలనను, రేవంత్ రెడ్డి రెండేళ్ల ప్రభుత్వాన్ని పోల్చి చూస్తున్నారని,వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులకు భంగపాటు తప్పదని ఎంపీ వద్దిరాజు స్పష్టం చేశారు.కాలినడకన సుమారు 6 కిలోమీటర్ల వరకు కొనసాగిన ప్రచార కార్యక్రమంలో వందలాది మంది కార్యకర్తలు, అభిమానులు గులాబీ జెండాలు చేబూని, కండువాలు ధరించి ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా “జై తెలంగాణ జైజై తెలంగాణ”,”జిందాబాద్ జిందాబాద్ బీఆర్ఎస్ జిందాబాద్”,”వర్థిల్లాలి వర్థిల్లాలి కేసీఆర్ నాయకత్వం వర్థిల్లాలి”,”కారు గుర్తుకే మన ఓటు”,”గెలిపిద్ధాం గెలిపిద్ధాం కారు గుర్తుకు ఓటేసి గెలిపిద్ధామంటూ”పెద్ద పెట్టున నినాదాలిచ్చారు. తమ తమ డివిజన్లలో ప్రచారం కోసం విచ్చేసిన మునిసిపల్ ఎన్నికల ఇంఛార్జి, ఎంపీ రవిచంద్రకు మహిళలు హారతులిచ్చి,బొట్టు పెట్టి స్వాగతం పలికారు, అభ్యర్థులు శాలువాలు కప్పి సత్కరించారు.
ఎంపీ వద్దిరాజు కొత్తగూడెం 22వ డివిజన్ లో ఎన్నికల ప్రచారం
బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గురువారం సాయంత్రం కొత్తగూడెం మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని 22వ డివిజన్ లో ఎన్నికల ప్రచారం జరిపారు. ఎంపీ రవిచంద్ర, మునిసిపల్ మాజీ ఛైర్ పర్సన్ సీతా మహాలక్ష్మీ, డివిజన్ అభ్యర్థి చింతలపూడి పార్వతి,ఆమె భర్త జగన్ తదితర నాయకులతో కలిసి గూని వీరభద్రరావు,ఆయన సతీమణి దుర్గా,మాజీ ఏంపీటీసీ శోభారాణి, ఆమె భర్త నరేంద్రలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు వెంట భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జి రామకృష్ణ,పార్టీ నాయకులు కార్తీక్,మాచిన శ్రీకాంత్,గాజుల కృష్ణ,ఆసిఫ్, కిశోర్, సిరికొండ రాజు,ఏస్.కే.సాజిద్ తదితరులు పాల్గొన్నారు.



