– యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు.. అన్ని ఆధారాలు ఉన్నాయి..
బలగం టీవీ, హైదరాబాద్:
యంగ్ ఇండియా స్కూల్స్‌లో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని, అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. త్వరలో పూర్తి వివరాలతో ప్రజల ముందుకు వస్తామని తెలిపారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ప్రభుత్వం పై తీవ్ర ఆరోపణలు చేశారు.
ఎవరికి ఎక్కువ టెండర్లు ఇచ్చారో సహా అన్ని వివరాలు బయటపెడతామని చెప్పారు. రాష్ట్ర పరిపాలనపై ముఖ్యమంత్రికి పట్టు లేదని విమర్శించారు. ప్రతిపక్షంగా తాము ప్రభుత్వాన్ని స్పందించేలా చేస్తున్నామని పేర్కొన్నారు.
ఖమ్మం పర్యటనలో కేటీఆర్ వెళ్లిన తర్వాతే ప్రభుత్వం స్థలాలు ఇస్తామని, ఇళ్లు కట్టిస్తామని ప్రకటించిందన్నారు. తాను శారదా పీఠాన్ని సందర్శించిన వెంటనే ప్రభుత్వం స్పందించిందని చెప్పారు. దేవాదుల ప్రాజెక్టు, హెల్త్ సిటీ వంటి అంశాల్లో కూడా తాము వెళ్లిన తర్వాతే చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు. జర్నలిస్టుల హెల్త్ స్కీంను ప్రభుత్వం గాలికి వదిలేసిందని విమర్శించారు. తమ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రత్యేక జీవో జారీ చేసి ఉద్యోగులకు ఉన్న సదుపాయాలే జర్నలిస్టులకు కల్పించామని గుర్తుచేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేనల్లుడికి చెందిన వ్యక్తులు నియోపోలీస్‌లో అక్రమ మైనింగ్ చేస్తున్నారని ఆరోపించారు. మొబైల్ క్రషింగ్ ప్లాంట్‌కు మాత్రమే అనుమతి ఉండగా, నిబంధనలకు విరుద్ధంగా ఫిక్స్డ్ క్రషింగ్ ప్లాంట్ ఏర్పాటు చేశారని తెలిపారు. ల్యాండ్ లీజ్‌పై 6 నుండి 7 శాతం ఫీజు చెల్లించాల్సి ఉండగా, నిబంధనలు ఉల్లంఘించారని అన్నారు. అధికారిక లేఖలో 10 ఎకరాలు కేటాయించగా, 15 ఎకరాల్లో మైనింగ్ జరుగుతోందని ఆరోపించారు. 15 లక్షల క్యూబిక్ మీటర్ల రాయికి సంబంధించిన ఫీజులను ఎగ్గొట్టారని చెప్పారు. అక్కడ రెడీమిక్స్ ప్లాంట్‌కు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఈ ఆరోపణలపై ప్రభుత్వం స్పందించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
