తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి గ్రామంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సిరిసిల్ల, వేములవాడ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలను, పోలింగ్ తర్వాత భద్రపరిచే ఈవిఎం స్ట్రాంగ్ రూం లను జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఇంచార్జీ అదనపు కలెక్టర్ గౌతమ్ రెడ్డి లతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఆయా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. అన్ని విషయాల పై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈసీఐ సూచనల మేరకు కౌంటింగ్ హాల్లో ఎలాంటి ఏర్పాట్లు చేయాలో ఆ విధంగా చేయాలన్నారు.ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఓట్ల లెక్కింపు కేంద్రాలలో పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులకు సూచించారు.
పోలింగ్ కు కౌంటింగ్ కు మధ్య సమయం తక్కువగా ఉన్నందున కౌంటింగ్ కు సంబంధించి ఇంకా మిగిలిన ఏర్పాట్ల ను మిషన్ మోడ్ లో పూర్తీ చేయాలన్నారు.
కౌంటింగ్ కేంద్రం లో అవుట్ ప్రకారం ఏర్పాట్లు కమ్యూనికేషన్ ప్లాన్, స్పీడ్
ఇంటర్నెట్ సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. ఒకవేళ ఇంటర్నెట్ పనిచేయకపోతే సమాచారం అందివ్వడంలో ఆలస్యం కాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు.
కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతించడానికి గల నిబంధనలు, కౌంటింగ్ ఏజెంట్ల నియామక నిబంధనలను, అబ్జర్వర్ లకు సంబంధించి చేసుకోవాల్సిన ఏర్పాట్లు, పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఎలా చేయాలి, ఆర్ ఓల బాధ్యతలు, మీడియా సెంటర్ ఏర్పాట్లు, సిసి కెమెరాల ఏర్పాటు,ఈవీఎం లను భద్రపరిచే స్ట్రాంగ్ రూం ఏర్పాట్లు,భద్రత చర్యలు, విడియో గ్రఫీ, ఫైర్ సేఫ్టీ చర్యలు,సిబ్బందికి భోజన సౌకర్యం తదితర విషయాల పై కలెక్టర్ అధికారులకు వివరించారు.ఓట్ల లెక్కింపు విధులు నిర్వహించే సిబ్బందికి గుర్తింపు కార్డులు ఇవ్వాలని, కౌంటింగ్ రూమ్, స్ట్రాంగ్ రూముల వద్ద ఎలా ఉండాలి, సీసీ కెమెరాలు ఏర్పాటు, వీడియోగ్రఫీ చేయడం, పటిష్ట భద్రత చర్యలు, తదితర అంశాలపై అధికారులకు సూచనలు చేశారు.కౌంటింగ్ హాల్ కు ఎంట్రీ,ఎగ్జిట్ ఉండాలని రెండు వైపులా గార్డులను ఏర్పాటు చేయాలన్నారు. ఆయా నియోజకవర్గాలకు సంబంధించి వాహన పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని, ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో విద్యుత్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
మీడియా కవరేజీ చేయాల్సిన విధానం,మీడియా సెంటర్ లో చేయాల్సిన ఏర్పాట్ల పై కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. కౌంటింగ్ కేంద్రం, స్ట్రాంగ్ రూం ల వద్ద పెండింగ్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. అనంతరం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ…
ఎన్నికల నిబంధన మేరకు కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూం ల వద్ద పటిష్ట భద్రత చర్యలు తీసుకుంటామన్నారు. కౌంటింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా భద్రతా చర్యలు చేపడతామన్నారు. సమావేశంలో పంచాయితీ రాజ్ ఇఈ సూర్య ప్రకాష్,సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారి శ్రీనివాస్,డిపిఆర్ఓ దశరథం,సిరిసిల్ల,వేములవాడ తహశీల్దార్ లు తదితరులు పాల్గొన్నారు.