మోదీ అమరావతి పర్యటన నేపథ్యంలో కేంద్రానికి సీపీఎం బహిరంగ లేఖ

0
90

బలగం టీవీ, అమరావతి:

అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభం సందర్భంగా మే 2వ తేదీన విచ్చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సీపీఎం బహిరంగ లేఖ రాసింది. ఢిల్లీని తలదన్నే రాజధానిని నిర్మిస్తామని 2014 ఎన్నికలకు ముందు మోదీ, ఎన్డీఏ పార్టీలు హామీ ఇచ్చారని, రాజధాని నిర్మాణానికి ఆర్థిక వనరులు సమకూర్చే బాధ్యత కేంద్రానిదేనని విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారని లేఖలో పేర్కొన్నారు.

2014లో అమరావతి శంకుస్థాపనకి మోదీ విచ్చేసిన సందర్భంలో భారీగా నిధులు ప్రకటిస్తారని ప్రజలు ఆశించారని, కానీ చెంబుడు నీరు, గుప్పెడు మట్టితో సరిపెట్టి రాష్ట్ర ప్రజల ఆశలను నీరు కార్చారని సీపీఎం ఆరోపించింది. సుమారు రూ. 50 వేల కోట్లు అవసరమని కోరినా, గత 11 సంవత్సరాల కాలంలో రూ. 1500 కోట్లు మాత్రమే రాజధాని నిర్మాణానికి కేంద్రం నిధులు కేటాయించిందని పేర్కొన్నారు.

గత రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని నీరుగార్చి, మూడు రాజధానుల పేరుతో వివాదాన్ని సృష్టించినా మోదీ నోరు విప్పలేదని, కేంద్రం జోక్యం చేసుకోలేదని, హైకోర్టులో రాజధాని నిర్మాణానికి కేంద్రానికి సంబంధం లేదని అఫిడవిట్ దాఖలు చేశారని సీపీఎం విమర్శించింది. 41 కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలకు అమరావతిలో స్థలాలు కేటాయించినా, ఇప్పటివరకు అత్యధిక కార్యాలయాలు పనులు కూడా ప్రారంభించలేదని, రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను మిగిల్చారని ఆరోపించింది.

2014 సంవత్సరంలో రాష్ట్రంలో టిడిపి, బిజెపి ప్రభుత్వం రూపొందించిన పూలింగ్ చట్టం నేటికీ పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోలేదని, రైతులు, కూలీలు, ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని, చట్టబద్ధమైన హామీలు అమలు కోసం, అమరావతి పరిరక్షణ కోసం పోరాడిన వారిపై పెట్టిన కేసులు ఈ నాటికి రద్దు చేయలేదని సీపీఎం పేర్కొంది.

కేంద్రంలో మూడోసారి మళ్లీ మోదీ అధికారంలోకి వచ్చారని, రాష్ట్రంలో ఆయన భాగస్వామిగా ఉన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, కనీసం ఇప్పుడైనా రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధులు విడుదల చేస్తారని ప్రజలు ఆశించారని సీపీఎం తెలిపింది. అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, హడ్కో తదితర సంస్థల ద్వారా రూ.31 వేల కోట్లు అప్పులు మంజూరు చేయించే ప్రకటనలకే పరిమితమయ్యారని, ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.1400 కోట్లు మాత్రమే గ్రాంటు ఇస్తుందని ప్రకటించారని, మళ్లీ అప్పులు, వడ్డీలతో సహా రాష్ట్ర ప్రజలే చెల్లించాలని, భవిష్యత్తులో ఇది భారంగా మారుతుందని పేర్కొంది.

అమరావతి నిర్మాణానికి లక్ష కోట్ల రూపాయలు అవసరమవుతాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని, మే రెండో తేదీ ప్రారంభ కార్యక్రమం సందర్భంగా విచ్చేస్తున్న మోదీ అప్పులు కాకుండా స్పష్టంగా గ్రాంట్లు ఇస్తూ ప్రకటన చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని సీపీఎం తెలిపింది. ఆరు నెలల కాలంలో కేంద్ర ప్రభుత్వ సంస్థల కార్యాలయాలు పూర్తి చేయడానికి నిర్దిష్ట చర్యలు ప్రకటించాలని, రాజధాని అమరావతితో పాటు రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు విషయంలో స్పష్టమైన ప్రకటన చేయాలని, విశాఖ ఉక్కు పరిరక్షణ, కడప ఉక్కు ఏర్పాటు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధుల పైన స్పందించాలని కోరింది.

రాష్ట్రం, రాజధాని అభివృద్ధిలో 10 సంవత్సరాలు పైగా విలువైన సమయం కోల్పోయామని, తక్షణమే నిధులు కేటాయించాలని, వేగంగా పనులు జరగాలని, రాజధాని అమరావతి, రాష్ట్రం సమగ్ర అభివృద్ధి చెందాలని, కనీసం ఈసారైనా నిధులు, అభివృద్ధికి అవసరమైన స్పష్టమైన చర్యలతో రాష్ట్ర ప్రజలు ఆశించిన రీతిలో మోదీ స్పందించాలని సీపీఎం విజ్ఞప్తి చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here