తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవం, ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం కార్యక్రమాల నిర్వహణ
- ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్
బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
అందరికీ సమాన అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ పేర్కొన్నారు. తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవం, ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో పలు సంక్షేమ శాఖల ఆద్వర్యంలో బుధవారం నిర్వహించగా, ముఖ్య అతిథిగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరయ్యారు.
ఈ సందర్బంగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవాన్ని నిర్వహిస్తుందని వివరించారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తుందని తెలిపారు. అన్ని శాఖల అధికారులు నిబంధనలకు అనుగుణంగా తమ కార్యాలయంలోని అటెండర్ నుంచి అన్ని స్థాయిల అధికారులకు సమాన అవకాశాలు కల్పించాలని, అన్ని వర్గాల పేద, బడుగు బలహీన వర్గాల వారికి ప్రభుత్వ ఫలాలు అందించాలని సూచించారు. ప్రభుత్వ హాస్టళ్లలో చదివే అవకాశం వచ్చిన విద్యార్థులు మంచిగా అభ్యసించి, ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఉన్నత ఉద్యోగాలు, స్థానాల్లో స్థిరపడి తమ ప్రాంతంలోని వారికి ఆదర్శంగా నిలువాలని పిలుపు నిచ్చారు. ఈ ఏడాది యూనైటెడ్ బై యూనిక్యూ అనే నినాదంతో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. జిల్లాలోని అన్ని వైద్యశాలల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేస్తున్నారని తెలిపారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. రోగ నిర్ధారణ జరిగితే ఉన్నత దవాఖానల్లో వైద్యం, మందులు అందిస్తున్నారని తెలిపారు. క్యాన్సర్ అంటూ వ్యాధి కాదని, వారిని చేరదీసి వైద్య సహాయం అందించాలని సూచించారు.
అనంతరం అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ మాట్లాడుతూ.. అభివృద్ధి, ప్రగతి కార్యక్రమాల్లో అన్ని వర్గాలతో ముందుకు వెళ్ళాలనేది ప్రభుత్వ నిర్ణయమని తెలిపారు. ప్రభుత్వ ఫలాలు అందరికీ అందేలా చూడాలని సూచించారు. క్యాన్సర్ పై డాక్టర్ హారిక వివరించారు. పొగాకు ఉత్పత్తులు, తినే.. మద్యం తాగేవారికే ఎక్కువగా క్యాన్సర్ వస్తుందని తెలిపారు. అలాగే రెడీమేడ్ ఫుడ్స్, ఎక్కువ ప్రాసెస్ చేసిన ఫుడ్స్ తో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని వివరించారు. రోజు వారి ఆహారంలో కూరగాయలు, పండ్లు తీసుకోవాలని, నిత్యం వ్యాయామం చేయాలని సూచించారు. క్యాన్సర్ నిర్ధారణ, వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. అనంతరం సామాజిక న్యాయ దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు.
కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి రవీందర్ రెడ్డి, బీసీ సంక్షేమ అధికారి సౌజన్య, మైనార్టీ సంక్షేమ అధికారి భారతి, ఎస్టీ సంక్షేమ అధికారి సంగీత, జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం, సీపీఓ శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు.



