బలగం టీవీ, కరీంనగర్:
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం గద్దపాక గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. వడ్లను అమ్మడానికి సిద్ధం చేస్తున్న సమయంలో గుండెపోటుకు గురై రైతు ఐలయ్య మృతి చెందాడు.
మంగళవారం సాయంత్రం మబ్బులు కమ్ముకోవడంతో వర్షం పడే సూచనలు కనిపించాయి. ఈ నేపథ్యంలో తాను పండించిన వడ్లను తడవకుండా కాపాడుకోవాలనే ఆందోళనతో ఐలయ్య వేగంగా వడ్లను కుప్పలుగా పోస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటుకు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
స్థానికులు వెంటనే స్పందించినప్పటికీ అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. ప్రభుత్వం సకాలంలో వడ్ల కొనుగోలు చేసి ఉండి ఉంటే రైతు ఇలాంటి ఆందోళనకు గురికాకుండా ఉండేవాడని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి, పంట కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
