ఇటీవల కాలంలో సైబర్ క్రిమినల్స్ మరింత తెలివి మీరుతున్నారు. సామాన్య ప్రజలను ఊహించని మార్గాల్లో మోసం చేస్తున్నారు. గత కొంతకాలంగా కేటుగాళ్లు ‘సిమ్ స్వాపింగ్ స్కామ్స్’ చేస్తూ ప్రజల బ్యాంకు అకౌంట్లను ఖాళీ చేస్తున్నారు. ఈ విధానంలో మోసగాళ్ళు ప్రజలు లేదా టెలికాం ప్రొవైడర్‌ను ఈజీగా మోసగిస్తారు.
తద్వారా బాధితుల SIM కార్డును పొందుతారు. ఆ SIM కార్డుతో బాధితుల ఆన్‌లైన్ అకౌంట్స్, సోషల్ మీడియా, బ్యాంకింగ్ వివరాలను యాక్సెస్ చేస్తారు. 2023, అక్టోబర్ 18న నార్త్ ఢిల్లీలో 35 ఏళ్ల న్యాయవాది అలాంటి స్కామ్‌లో బాధితులయ్యారు.
వివరాల్లోకి వెళితే, ఇటీవల తెలియని నంబర్ నుంచి మూడు మిస్డ్ కాల్స్ వచ్చాయి. ఆమె కాల్స్‌కు సమాధానం ఇవ్వలేదు. ఎవరికీ OTPని పంచుకోలేదు. అయితే ఆమె వేరే నంబర్ నుంచి తిరిగి కాల్ చేసినప్పుడు, కాల్ చేసిన వ్యక్తి కొరియర్ డెలివరీ బాయ్ అని పరిచయం చేసుకున్నాడు. అడ్రస్ ఇవ్వమని అడిగాడు.
స్నేహితురాలి నుంచి ప్యాకేజీ అందుతుందని భావించి ఆమె అడ్రస్ ఇచ్చారు. కొంతసేపటికి ఒక ప్యాకేజీని పికప్ చేసుకున్నారు. కొద్ది గంటల తర్వాత రెండు విత్‌డ్రాలు చేసినట్లు బ్యాంక్ నుంచి రెండు మెసేజెస్ వచ్చాయి. అది గమనించిన లాయర్ షాక్ అయ్యారు. లాయర్ ఎలాంటి బ్యాంక్ వివరాలు షేర్ చేయకపోయినా, క్రిమినల్ బ్యాంక్ డిటేల్స్, తదితర వివరాలన్నీ పొందగలిగాడు.
ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇది సిమ్ స్వాపింగ్ స్కామ్ అయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. నేరగాళ్లు ప్రజల ఫోన్లకు ఫిషింగ్ లింక్స్ పంపించి.. డివైజ్‌ను యాక్సెస్ చేస్తారు. వారికి సంబంధించిన ఐడీ కార్డులను దొంగిలిస్తారు. తర్వాత సిమ్ పోయిందని టెలికాం ఆపరేటర్లకు ఫిర్యాదు చేసి, బాధితుల ఫోన్ నంబర్లతో కొత్త సిమ్ తీసుకుంటారు. దీనితో యూపీఐ ట్రాన్సాక్షన్లు చేసి డబ్బు దొంగిలిస్తారు.
ప్రస్తుత కేసులో బాధితురాలికి తెలియని UPI రిజిస్ట్రేషన్లు, ఫిషింగ్-సంబంధిత SMSలను పోలీసులు గుర్తించారు. IFSO ఆఫీసర్‌గా నటిస్తూ తెలియని వ్యక్తి ఒకరు కాల్ చేశాడని , అతనితో ఎలాంటి వివరాలను పంచుకోలేదని బాధితురాలు తెలిపారు. IFSO అంటే ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ యూనిట్ ఆఫ్ ది ఢిల్లీ పోలీస్. పోలీసులు కేసును ఇంకా దర్యాప్తు చేస్తున్నారు, ప్రస్తుతానికైతే మోసగాళ్ళను గుర్తించలేదు లేదా అరెస్టు చేయలేదు.
ఒరిజినల్ సిమ్ కార్డ్ ఇప్పటికీ పనిచేస్తుందో లేదో చెక్ చేయడానికే నేరగాడు బాధితురాలి నంబర్‌కు మిస్డ్ కాల్స్ ఇచ్చాడు. బాధితురాలు కాల్స్‌కు సమాధానం ఇవ్వకపోతే, ఒరిజినల్ సిమ్ కార్డ్ డియాక్టివేట్ అయిందని, డూప్లికేట్ సిమ్ కార్డ్ యాక్టివేట్ అయ్యిందని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు. దానికంటే ముందు ఆ లాయర్ డీటైల్స్‌ను ఆన్‌లైన్ ద్వారా సేకరించినట్లు ఉన్నాడు. లాయర్ నంబర్ తనదేనని నమ్మబలుకుతూ టెలికాం ప్రొవైడర్‌ను ఇతడు సంప్రదించి ఉంటాడు.
ఆ సమయంలో లాయర్ నంబర్ వర్క్ అవుతున్నా, ఆ నంబర్ గల ఫోన్ పోయిందని లేదా ఎవరో కొట్టేసారని చెబుతూ కోసం డూప్లికేట్ సిమ్ కార్డ్‌ని ఈ కేటుగాడు రిక్వెస్ట్ చేసినట్లు ఉన్నాడు. సిమ్ కార్డు పొందడానికి ఫేక్ ఐడెంటిటీ ప్రూఫ్స్ లేదా అధికారులకు లంచం ఇచ్చి ఉండొచ్చు. లాయర్‌ను అడ్రస్ అడిగి ఆ వివరాలను ప్రూఫ్స్‌గా ఇచ్చి ఉండొచ్చు. ఈ విధంగా స్కామ్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
- SIM స్వాపింగ్ స్కామ్
సిమ్ స్వాపింగ్ స్కామ్‌లు చాలా కామన్ అయిపోయాయి కాబట్టి బాధితులుగా మారకుండా ఉండటానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. ప్రధానంగా ఉన్నట్టుండి సిమ్ పని చేయడం ఆగిపోతే, వెంటనే టెలికాం ప్రొవైడర్‌ను సంప్రదించాలి. సిమ్ స్వాప్ అయ్యిందో లేదో అడిగి తెలుసుకోవాలి.
అనుమతి లేకుండా ఇతరులు SIMని వారి పరికరాలలో ఉపయోగించకుండా నిరోధించడానికి SIM లాక్ లేదా PINని ఉపయోగించాలి. వ్యక్తిగత లేదా ఆర్థిక సమాచారాన్ని ఆన్‌లైన్‌లో షేర్ చేయకూడదు, ప్రత్యేకించి అది పాస్‌వర్డ్‌లు లేదా OTPs రివీల్ చేసే ఇన్ఫర్మేషన్ షేర్ చేయకూడదు.
బ్యాంక్ అకౌంట్స్, ఆన్‌లైన్ సర్వీసెస్ క్రమం తప్పకుండా చెక్ చేసుకోవాలి. తెలియకుండా ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగితే వెంటనే చర్యలు తీసుకోవాలి. OTP, బ్యాంక్ వివరాలు, UPI పిన్ లేదా ఇతర సున్నితమైన సమాచారాన్ని అడిగే కాల్స్ లేదా మెసేజ్‌లను విశ్వసించవద్దు. ఆన్‌లైన్ అకౌంట్స్ కోసం స్ట్రాంగ్, యూనిక్ పాస్‌వర్డ్‌లను ఉపయోగించాలి. వాటిని తరచుగా మార్చాలి. సాధ్యమైనప్పుడల్లా టూ-ఫ్యాక్టర్ అథెంటిఫికేషన్ ఆన్ చేయాలి.