తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ..

0
34

తెలంగాణ జాతిపిత కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు..

  • బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని, కాంగ్రెస్ – బీజేపీలు కుమ్మక్కై బీఆర్ఎస్ పార్టీని అణచివేసేందుకు కుట్ర పన్నుతున్నాయని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై నిప్పులు చెరిగారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఒకరికొకరు ప్రొటెక్షన్ ఇచ్చుకుంటున్నారని, వీరిద్దరి మధ్య ఉన్న అక్రమ సంబంధం బట్టబయలైందని విమర్శించారు. ఆమనగల్లులో ఒక్క సీటు వచ్చిన కాంగ్రెస్‌కు బీజేపీ మద్దతు ఇవ్వడమే దీనికి నిదర్శనమన్నారు. మెజార్టీ ఉన్నప్పటికీ మంత్రి వివేక్ వెంకటస్వామి ఒత్తిడితో అధికారులు ఎన్నికను వాయిదా వేస్తున్నారని ఆరోపించారు.

జనగాం లో ఒక దళిత మహిళా కౌన్సిలర్‌పై కాంగ్రెస్ నేత దాడి చేయడం దారుణమని, దీనిపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్సీ దండే విఠల్ రెండు చోట్ల ఎక్స్ అఫీషియో ఓట్లు నమోదు చేసుకోవడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని, కడియం కావ్యకు ఎంపీగా కొనసాగే నైతిక అర్హత లేదని స్పష్టం చేశారు. ఒక మాజీ పోలీస్ అధికారిగా తాను బాధపడుతున్నానని చెబుతూ.. పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారి కౌన్సిల్ హాల్‌లోకి ప్రవేశించడం చట్టవిరుద్ధమని అన్నారు. రేవంత్ రెడ్డి పోలీసులను వాడుకొని బీఆర్ఎస్ ను ఖతం చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ జాతిపిత కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, పోరాట యోధుడు పుట్టిన రోజే తెలంగాణ రాబందుల పాలైందని ఆవేదన వ్యక్తం చేశారు.

రేవంత్ రెడ్డి నియంతృత్వ పోకడలు మానుకోకపోతే నేపాల్, బంగ్లాదేశ్ తరహా పరిస్థితులు తెలంగాణలో వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల్లో జరుగుతున్న అక్రమాలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని ఆయన ప్రకటించారు.

ఈ సమావేశంలో కల్వకుర్తి బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ యాదవ్ కూడా పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here