శ్రీ రాజరాజేశ్వర వేద ఆగమ సంస్కృత విద్యాలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో పట్టాల పంపిణీ..

0
103

రాజన్న ఆలయ అభివృద్ధిపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వెల్లడి..

బలగం టీవీ, వేములవాడ:

వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ రాజరాజేశ్వర వేద ఆగమ సంస్కృత విద్యాలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ పార్వతీ రాజరాజేశ్వర అఖిల భారత వేద శాస్త్ర స్మార్త ఆగమ విద్వత్ సదస్సు ఘనంగా నిర్వహించారు. ఈ సదస్సులో భాగంగా వేద పండితులకు నిర్వహించిన చతుర్వేద స్మార్త పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన 157 మంది వేద పండిత విద్యార్థులకు పట్టాలను పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరై వేద పండిత విద్యార్థులకు పట్టాలు అందజేశారు. పరీక్ష నిర్వహించిన వేద పండితులను ఘనంగా సన్మానించి, ప్రశంసా పత్రాలు అందజేశారు.

తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రాజన్నను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా వేద పండిత విద్యార్థులకు నిర్వహించే చతుర్వేద స్మార్త పరీక్షలను తెలంగాణ రాష్ట్రంలో వేములవాడలో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.

ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, భారతదేశం సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అని, హైందవ సంస్కృతిలోని వేదాలను ప్రపంచంలోని ఇతర దేశాలు కూడా ఆచరిస్తున్నాయని గుర్తు చేశారు. అనేక ఆశ్రమాల్లో, దేవాలయాల్లో భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని, రాష్ట్ర ప్రభుత్వం ఈ పెరుగుతున్న భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఆలయాలను అభివృద్ధి చేస్తుందని హామీ ఇచ్చారు. రానున్న రోజుల్లో పరీక్ష రాసే వేద విద్యార్థుల సంఖ్య పెరగాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం వేద పండితులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. మన పూర్వీకులు తాళపత్ర గ్రంథాల ద్వారా వేదాలను మనకు అందించారని అన్నారు.

గతంలో రాజన్న దేవస్థానం ఛైర్మన్‌గా ఉన్నప్పుడు ఆలయంలో అనేక అభివృద్ధి పనులు చేశానని ఆది శ్రీనివాస్ గుర్తు చేసుకున్నారు. రాజన్న ఆలయ విస్తరణ చేసే భాగ్యం కలగడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. నాలుగు సార్లు శృంగేరి వెళ్లి ఆలయ అభివృద్ధి, విస్తరణపై పీఠాధిపతులతో చర్చించి ముందుకు వెళ్తున్నామని తెలిపారు. రూ. 47 కోట్లతో రోడ్డు వెడల్పు, రూ. 35 కోట్లతో అన్నదాన సత్రం నిర్మాణం చేపడుతున్నామని వెల్లడించారు. రూ. 150 కోట్లు రాజన్న ఆలయ అభివృద్ధికి కేటాయించడం జరిగిందని, వేలాదిగా వచ్చే రాజన్న భక్తులకు మెరుగైన వసతులు కల్పించడం కోసం ముందుకు పోతున్నామని చెప్పారు. రూ. 76 కోట్లతో ఆలయ విస్తరణ పనులకు టెండర్లు పిలుస్తున్నామని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని ప్రకటించారు.

రాజన్న ఆలయ విస్తరణ ఏ ఒక్కరి సొంత ఎజెండా కాదని, ఇది రాజన్న భక్తుల ఎజెండా అని ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. ప్రతీ ఒక్కరి సలహాలు, సూచనలు తీసుకొని ముందుకు పోతామని, రాజన్న ఆలయ అభివృద్ధి, విస్తరణకు అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. రోడ్డు వెడల్పులో భూ నిర్వాసితుల త్యాగం మరవలేనిదని, వారికి ప్రభుత్వం తరపున ప్రత్యేక ఆలోచనలు చేస్తుందని హామీ ఇచ్చారు. చివరిగా, పట్టాలు పొందుతున్న వేద పండిత విద్యార్థులు జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here