బలగం టివి, సిరిసిల్ల
రోగులకు అత్యుత్తమ, నాణ్యమైన వైద్య సేవలు అందించడం, ఆసుపత్రిలోని విభాగాల మెరుగైన నిర్వహణకు గానూ వేములవాడ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి కేంద్ర ప్రభుత్వం నుండి నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ (ఎన్క్వాస్) సర్టిఫికెట్ పొందిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ని సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో వేములవాడ ప్రాంతీయ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిశారు.
ఫార్మసీ, ఓపీడీ, అడ్మిన్, రేడియాలజీ, ఎమర్జెన్సీ, ఆక్సిలరీ సర్వీసెస్, ఐపీడీ, ఓటీ, ల్యాబ్, మెటర్నిటీ వార్డ్ లలో అందిస్తున్న సేవలకు గానూ ఎన్ క్వాస్ సర్టిఫికేషన్, లేబర్ రూమ్ మెరుగైన నిర్వహణకు గానూ లక్ష్య ప్రోగ్రామ్ లో భాగంగా సర్టిఫికేషన్ ను, అలాగే పిడియాట్రిక్ విభాగంలో ఉత్తమ వైద్య సేవలు అందించినందుకు గానూ ముస్కాన్ సర్టిఫికేషన్ ను వేములవాడ ప్రాంతీయ ఆసుపత్రి కైవసం చేసుకుంది.
అవార్డు మీ బాధ్యతను మరింత పెంచిందని, ఇదే స్ఫూర్తితో ఆసుపత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన, అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని కలెక్టర్ ఆకాంక్షించారు.
కార్యక్రమంలో ఆసుపత్రి పర్యవేక్షకులు డా. ఆర్.మహేష్ రావు, డాక్టర్లు అనిల్, సంతోష్ చారి, సిబ్బంది పాల్గొన్నారు.
