– పారదర్శకంగా కొత్త కనెక్షన్ల మంజూరు
- కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు
- సిరిసిల్ల ఎస్ఈ. బి. బిక్షపతి
బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
విద్యుత్ సేవలను మరింత సులభతరం చేసి, పారదర్శకంగా అందించాలనే లక్ష్యంతో ఇకపై కొత్త విద్యుత్ కనెక్షన్లతో పాటు ఇతర ప్రధాన సేవలను నేరుగా ‘మీ సేవ’ కేంద్రాల ద్వారా పొందవచ్చని విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ బి. బిక్షపతి తెలిపారు. బుధవారం సిరిసిల్ల పట్టణంలోని మీ సేవ కేంద్రాన్ని విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ బి. బిక్షపతి సందర్శించి , దరఖాస్తుల నమోదు ప్రక్రియను స్వయంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ బి. బిక్షపతి మాట్లాడుతూ.. గతంలో విద్యుత్ సంబంధిత పనుల కోసం వినియోగదారులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేదని, దీనివల్ల సమయం, శ్రమతో పాటు అదనపు ఖర్చులు అయ్యేవని,ఈ ఇబ్బందులను తొలగించేందుకు పారదర్శకమైన ఆన్‌లైన్ వ్యవస్థను మీ సేవ ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చామని అన్నారు. గృహ, వాణిజ్య, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం, పేరు మార్పిడి,బిల్లుల చెల్లింపు మరియు ఇతర సేవలు కోసం మీ సేవలో దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్ ద్వారా పారదర్శకంగా జరుగుతుందని, ఎక్కడా అవినీతికి లేదా జాప్యానికి అవకాశం ఉండదని పేర్కొన్నారు. ప్రతి దరఖాస్తును నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు తమకు సమీపంలో ఉన్న మీ సేవ కేంద్రాలను సందర్శించి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
