నేత్రదానం చేసిన అనిల్ కుటుంబం సభ్యులు
వరంగల్ లోని హాస్పిటల్ కు వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చిన సర్పంచ్ రెడ్డివేణి పర్శరాం
బలగం టీవీ, వేములవాడ:
విధి ఆడిన వింత నాటకంలో ఒక నిరుపేద కుటుంబం పెద్దదిక్కును కోల్పోయింది. కానీ ఆ పుట్టెడు దుఃఖంలోనూ ఆ కుటుంబం తీసుకున్న నిర్ణయం మానవత్వానికి నిలువుటద్దంగా నిలిచింది. తాను మరణించినా మరో ఇద్దరి కళ్లలో సజీవంగా ఉండాలన్న గొప్ప సంకల్పంతో ఆ కుటుంబ సభ్యులు చేసిన నేత్రదానం పలువురిని కన్నీరు పెట్టించడమే కాకుండా స్ఫూర్తిని రగిలిస్తోంది. వేములవాడ అర్బన్ మండలం సంకెపల్లి గ్రామానికి చెందిన పోచెంపల్లి అనిల్ (35) వృత్తిరీత్యా కూలీగా జీవనం సాగించేవారు. శుక్రవారం వ్యక్తిగత పనుల నిమిత్తం తన ద్విచక్రవాహనంపై వేములవాడకు వెళ్తుండగా, నాంపల్లి ఘాట్ రోడ్డు సమీపంలో ఒక్కసారిగా కుక్క అడ్డు రావడంతో వాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో అనిల్ తలకు తీవ్ర గాయాలవ్వగా, వెంటనే వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శుక్రవారం ఆయన మృతి చెందారు. అనిల్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. రెక్కాడితే గాని డొక్కాడని ఆ కుటుంబంలో ఇంటి పెద్ద మరణం పెను విషాదాన్ని నింపింది.
అనిల్ మరణ వార్త విన్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్న సమయంలోనే ఒక గొప్ప ఆలోచన చేశారు. అనిల్ భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన కళ్లు ఈ లోకాన్ని చూడాలన్న ఉద్దేశంతో నేత్రదానానికి ముందుకు వచ్చారు. ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్యాలయానికి అనిల్ కళ్లను అందజేయగా, ఈ సందర్భంగా వైద్యశాల ప్రతినిధులు అనిల్ కుటుంబ సభ్యుల గొప్ప మనసును అభినందిస్తూ వారికి ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. “మా అనిల్ చనిపోయినా, అతని కళ్లు ఎల్లప్పుడూ సజీవంగానే ఉంటాయి.. ఎవరికో ఒకరికి చూపునిస్తాయనే ఆ తృప్తి చాలు” అంటూ కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఆ నిరుపేద కుటుంబం చూపిన ఈ మానవత్వ దృక్పథంపై గ్రామస్థులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
అనిల్ మృతి చెందిన విషయం తెలియగానే సంకెపల్లి గ్రామ సర్పంచ్ రెడ్డవేణి పర్శరాం హుటాహుటిన వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి చేరుకుని మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. శనివారం పోస్టుమార్టం అనంతరం అనిల్ మృతదేహాన్ని స్వగ్రామం సంకెపల్లికి తరలించి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అకాల మరణం చెందిన అనిల్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, ఆ చిన్న పిల్లల భవిష్యత్తు కోసం ఆర్థిక సాయం అందించాలని గ్రామస్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
