బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల :
- ప్రభుత్వ ఉద్యోగ కలను సాకారం చేసుకున్న యువకుడు..
- నాలుగు ఉద్యోగాలు సాధించి యువతకు స్ఫూర్తిగా నిలిచిన మెతుకు సంతోష్..
- గ్రూప్- 1 లక్ష్యంగా ముందుకు
శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ భానిస ఆవుతుంది అన్న సూక్తిని గుర్తుపెట్టుకుంటూ తను చదువుకున్న చదువుకు ఓ గుర్తింపు ఉండాలని, కన్నవారు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా సర్కారు నౌకరి లక్ష్యంగా, ఎన్నెన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న నౌకరి సాధించేవరకు విశ్రమించేది లేదని పట్టుబట్టి
ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా నాలుగు ప్రభుత్వ కొలువులు సాధించి ఔరా అనిపించాడు రైతు బిడ్డ మెతుకు సంతోష్.. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన మెతుకు కళావతి రాములు ది సాధారణ వ్యవసాయ కుటుంబం. వీరికి ఇద్దరు కుమారులు కాగా పెద్ద కుమారుడు మెతుకు సంతోష్ మంగళవారం టీజీపీఎస్సీ విడుదల చేసిన గ్రూప్ 2 ఫలితాల్లో 235 ర్యాంక్ సాధించాడు.
సర్కారీ కొలువులపైనే గురి :
మల్లారెడ్డిపేటలోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి పూర్తి సంతోష్, ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల జూనియర్ కాలేజీలో ఇంటర్, గాయత్రి డిగ్రీ కాలేజీలో డిగ్రీ, ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ పూర్తి చేశాడు. చిన్నప్పటి నుండి ప్రభుత్వ కొలువు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న సంతోష్ , పీజీ తర్వాత తర్వాత సర్కారీ కొలువులపైనే గురి పెట్టాడు.
మొక్కవోని దీక్షతో సాధన :
పీజీ తర్వాత పోటీ పరీక్షలకుసన్నద్ధమవ్వాలని నిర్ణయించుకున్న సంతోష్ పోటీ పరీక్షలకు శిక్షణ నిచ్చే సంస్థలో చేరి, అక్కడి నుంచి విరామం లేకుండా పట్టుదలతో చదివాడు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న సమయంలో అనేక ఒడిదుడుకులు, సమస్యలు వచ్చినప్పటికీ మొక్కవోని దీక్షతో ముందుకు సాగాడు. ప్రభుత్వ ఉద్యోగ వేటలో నిమగ్నమైన సంతోష్ ఒకటి రెండు కాదు ఏకంగా వరుసగా నాలుగు ప్రభుత్వ కొలువులు సాధించి ఔరా అనిపించాడు. వరుసగా సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్ గా, ఎక్సైజ్ కానిస్టేబుల్, గ్రూప్ 4 లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు సాధించాడు. సింగరేణి లో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహించి సమయంలో గ్రూప్ 4 ఫలితాల్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం రావడంతో, సింగరేణి జూనియర్ అసిస్టెంట్కు రిజైన్ చేసి, సిరిసిల్లలోని ట్రెజరీ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్ గా చేరి, ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం విడుదలైన గ్రూప్ 2 ఉద్యోగ నియామకాల్లో రాష్ట్రస్థాయి 235 ర్యాంకుతో గ్రూప్ 2 ఉద్యోగానికీ ఎంపికయ్యాడు. ఏకంగా నాలుగు ఉద్యోగాలు సాధించడంతో పలువురు కి సంతోష్ ఆదర్శంగా నిలిచాడు.