బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
- కేసిఆర్ అంటే కాళేశ్వరం..కాంగ్రెస్ అంటే శనీశ్వరం..
- కే సీ ఆర్ మీద కోపం ఉంటే రాజకీయంగా ఎదుర్కో..
- కేసీఆర్ పై కోపం రైతులపై చూపించవద్దు..
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
రేవంత్ ప్రభుత్వం వచ్చాక నీళ్లేమో పాతాళంలోకి, నిధులేమో ఢిల్లీకి,నియామకాలు ఏమో గాల్లో కలిసిపోయాయని, కాంగ్రెస్ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని రైతులను కాపాడుకోవడానికి వెంటనే మిడ్ మానేరు నుండి నీళ్లను విడుదల చేయాలని, లేకపోతే అన్నదాతలతో కలిసి పోరాటాన్ని ఉధృతం చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. ఆదివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సిరిసిల్ల ఎమ్మెల్యే సిరిసిల్ల నియోజక వర్గంలో పర్యటించారు.ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులో జైలుకు వచ్చిన తంగళ్లపల్లి మండలం జిల్లెళ్లకు చెందిన రైతు అబ్బాడి రాజిరెడ్డిని, సిరిసిల్ల లో ప్రభుత్వ కుట్రతో హోటల్ ని అకారణంగా మూసివేసిన టీ కొట్టు నిర్వాహకుడు బత్తుల శ్రీనివాస్ని,ఇటీవల మృతి చెందిన బుర్ర శంకరయ్య,సీనియర్ నాయకుడు కాసర్ల మల్లేశం కుటుంబాలని పరామర్శించారు. అనంతరం ఎల్లారెడ్డిపేట మండలంలోని రాజన్నపేట, దేవుని గుట్ట తండాలో సాగునీరు లేక ఎండిపోతున్న పంట పొలాలను పరిశీలించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ కాళేశ్వరం నుంచి నీళ్లు తీసుకువచ్చి, మల్కపేట రిజర్వాయర్ లో పోస్తే దేవుని గుట్ట తండాలోని రైతులు వ్యవసాయం చేసేవారని, కేసీఆర్ మీద ఉన్న కోపం, ద్వేషంతో మేడిగడ్డ లో జరిగిన కుట్రపూరిత ప్రమాదాన్ని సాకుగా చూపించడంతో రాష్ట్రవ్యాప్తంగా పంటలు ఎండిపోతున్నాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సిరిసిల్ల ప్రాంతంతోపాటు, ఇతర ప్రాంతాల్లో చాలామంది రైతులు సాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారని,కాళేశ్వరం నీళ్లు రాక తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ ప్రాంతాల్లోనూ వ్యవసాయం సంక్షోభంలోకి నెట్టబడిందని అన్నారు. కెసిఆర్ అంటే కాళేశ్వరం,కాంగ్రెస్ అంటే శనీశ్వరమని,ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని అన్నారు. మేడిగడ్డ పర్రెను రిపేర్ చేసి సాగునీరు ఇవ్వచ్చు అని, కేసీఆర్ మీద కోపంలో మేడిగడ్డను రిపేరు చెయ్యక, రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీరు అందించడం లేదు అని అన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిండు వేసవి, ఎర్రటి ఎండల్లో సిరిసిల్ల జిల్లాలోని అప్పర్ మానేరు ను కాలేశ్వరం జలాలతో నింపడంతో ముత్తడి దుంకిందని అన్నారు. ఆనాడు మా ప్రభుత్వంలో కాలేశ్వరం జలాలతో మిడ్ మానేరు,అప్పర్ మానేరు నింపడంతో ఎర్రటి ఎండల్లో కూడా వాగులు చెరువులను నింపి, పంట పొలాలకు సాగునీరు అందించి రైతులను కాపాడుకున్నమని అన్నారు. సిరిసిల్ల జిల్లాలో వందల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని, చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు అని, 48 గంటల్లో నీళ్లను వదిలి పెట్టకపోతే మంత్రి ఛాంబర్ ముందట ధర్నా చేస్తామని, ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని అన్నారు. కెసిఆర్ మీద కోపం ఉంటే రాజకీయంగా తలపడాలి, రైతుల మీద చూపించవద్దు అని,వారిని గోస పెట్టుకోవద్దని అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 450 మంది రైతులను రేవంత్ రెడ్డి పొట్టన పెట్టుకున్నాడని అన్నారు. కాంగ్రెస్ చెప్పిన రైతు డిక్లరేషన్ లో ఒక్క మాటను కూడా నిలబెట్టుకోలేదని,రైతు బంధును కూడా వెయ్యడం లేదని, ప్రభుత్వానికి కరెంటు నీళ్లు ఇచ్చే తెలివి లేదని అన్నారు. ప్రస్తుతం మిడ్ మానేరులో 16 టీఎంసీల నీళ్లు ఉన్నాయి, ఒక్క టీఎంసీ నీళ్లను మల్కపేట రిజర్వాయర్కు వదిలిపెట్టాలని కోరుతున్నా, తాగునీటి అవసరాలకు మూడు టీఎంసీలు మాత్రమే కావాలి,తాగునీటికి ఎలాంటి ఇబ్బంది రాదు ఇంకా 13 టిఎంసిల నీళ్లు మిడ్ మానేరు లో ఉంటాయని, రైతులకు నీళ్లు విడుదల చేయకపోతే అన్నదాతలతో కలిసి పోరాటాన్ని ఉధృతం చేస్తామని అన్నారు.