కరెంట్ షాక్‌కు గురైన తల్లిని కాపాడిన ధైర్యవంతుడు దీక్షిత్..
బలగం టీవీ, పశ్చిమగోదావరి:
తన కళ్లముందే కరెంట్ షాక్‌తో కొట్టుమిట్టాడుతున్న తల్లిని చూసి ఏమాత్రం భయపడకుండా, సరైన సమయంలో స్పందించి ప్రాణాలు కాపాడిన ఒక ఐదవ తరగతి విద్యార్థి సమయస్ఫూర్తిని స్థానికులంతా ప్రశంసిస్తున్నారు. ఈ అద్భుతమైన ఘటన పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం మండలం, జొన్నలగరువు గ్రామంలో జరిగింది.
జొన్నలగరువులోని ప్రభుత్వ పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్న దీక్షిత్ అనే బాలుడు ఈ ధైర్యసాహసాలు ప్రదర్శించాడు. స్కూల్లో మెగా పేరెంట్స్ మీటింగ్ ఉన్న క్రమంలో, మీటింగ్‌కు వస్తానని చెప్పిన తన తల్లి ఎంతకీ రాకపోవడంతో దీక్షిత్ ఇంటికి వెళ్లి చూడగా, తన తల్లి కరెంట్ షాక్‌తో కొట్టుమిట్టాడుతూ కనిపించింది. ఇంటివద్ద ఉన్న మంచినీటి మోటార్ వైరు తగిలి ఆమెకు విద్యుదాఘాతం కలిగినట్లు తెలుస్తోంది. ఈ భయానక దృశ్యం చూసిన దీక్షిత్ ఏమాత్రం కంగారు పడలేదు. పెద్దగా కేకలు వేసి ఇతరులను పిలిచే సమయం లేదని, ఆలస్యం చేస్తే తల్లి ప్రాణాలకు ప్రమాదమని గ్రహించాడు. వెంటనే సమయస్ఫూర్తితో ఆలోచించి, ప్రమాదానికి కారణమైన మోటార్ స్విచ్‌ను ఆఫ్ చేశాడు. అనంతరం తల్లికి తగిలి ఉన్న వైర్‌ను తొలగించి ఆమె ప్రాణాలను కాపాడాడు.
విద్యుదాఘాతం నుంచి తేరుకున్న తల్లిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించాడు దీక్షిత్. చికిత్స అనంతరం తల్లి క్షేమంగా ఉండటంతో, ఇద్దరూ కలిసి పాఠశాలలో జరుగుతున్న పేరెంట్స్ మీటింగ్‌కు హాజరయ్యారు. దీక్షిత్ ప్రదర్శించిన ధైర్యసాహసాలు, సమయస్ఫూర్తి వల్లే ఆ తల్లికి పునర్జన్మ లభించిందని స్థానికులంతా కొనియాడుతున్నారు.
