ప్రజల సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యం
- ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
మున్సిపల్ ఎన్నికల్లో పాస్ మార్కులు ఇచ్చి గెలిపించిన ప్రజలకు రానున్న రోజుల్లో ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చేలా పనిచేసి ప్రజల మన్ననలు పొంది, ఫస్ట్ క్లాస్ ఫలితాలు సాధించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. శనివారం వేములవాడ మున్సిపల్ చైర్మన్‌గా పుల్కం రాజు, వైస్ చైర్మన్‌గా నరాల శేఖర్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై నూతన పాలకవర్గాన్ని అభినందించారు.
ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. నూతన మున్సిపల్ పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల సమస్యల పరిష్కారమే ప్రధాన ధ్యేయంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని స్వదినియోగం చేసుకుని పట్టణ అభివృద్ధికి కట్టుబడి పనిచేయాలని కోరారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని, మున్సిపల్ పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగిరేలా ఆశీర్వదించిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
రాజన్న ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులతో కలిసి సమన్వయంతో పనిచేయాలని, వేగంగా విస్తరిస్తున్న వేములవాడ పట్టణంలో సకల వసతులు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. గత రెండేళ్లుగా జరుగుతున్న అభివృద్ధి కొందరికి కనిపించకపోతే, వాడ వాడలో అభివృద్ధి పనులు చేపట్టి వారికి స్పష్టంగా చూపించాలని అన్నారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన ఆరు గ్యారంటీలను ప్రభుత్వం అమలు చేస్తున్నదని అన్నారు . మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ వంటి పథకాలు అమలులో ఉన్నాయని, ప్రజా ప్రభుత్వంపై కొందరు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని ఆరోపిస్తూ, కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్లలో చేయని అప్పును మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు కేవలం 10 ఏళ్లలో చేసి,రాష్ట్రాన్ని దివాళా దశకు తీసుకెళ్లారని అన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందని, గ్లోబల్ సమ్మిట్‌ల ద్వారా పెట్టుబడులు వస్తున్నాయని అన్నారు.
గతంలో బ్రిడ్జి, ఆలయ అభివృద్ధి, సూరమ్మ చెరువు వంటి పనుల కోసం పోరాటాలు చేశామని, అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని ముమ్మరంగా చేపట్టామని తెలిపారు. కలికోట సూరమ్మ చెరువు, మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులు త్వరలో పూర్తి అవుతాయని చెప్పారు. గతంలో చేసిన పోరాటాల్లో 90 శాతం పనులు పూర్తి చేశామని అన్నారు. వేములవాడ నుంచి చందుర్తి–రుద్రంగి మీదుగా సిరికొండ వరకు 180 కోట్ల రూపాయలతో 100 ఫీట్ల రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయని, హనుమాజీపేట నుంచి అజ్మరా తండా వరకు 25 కోట్ల రూపాయలతో రోడ్డు పనులకు నిధులు కేటాయించామని అన్నారు .మన ప్రాంతంలో కక్ష సాధింపు రాజకీయాలకు తావు లేదని, అన్ని వర్గాల ప్రజలను కలుపుకుపోతూ ముందుకు సాగాలని సూచించారు. నూతన పాలకవర్గం అన్ని వార్డుల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టాలని ఆకాంక్షించారు.
