రైతు భరోసాపై మోసం.. ఎన్నికల్లో ఓట్ల కోసం రైతులతో చెలగాటం..

0
25
  • మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

బలగం టీవీ, హైదరాబాద్:

రైతు భరోసా పథకం అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హామీల అమలు విషయంలో కాంగ్రెస్‍ ప్రభుత్వం పై ఆయన మండిపడ్డారు. గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ, కాంగ్రెస్ పార్టీ రైతులను, కూలీలను నిలువునా మోసం చేసిందని విమర్శించారు.

ఎకరాకు రూ. 15,000 రైతులకు, కౌలు రైతులకు ఇస్తామని.. అలాగే రైతు కూలీలకు ఏడాదికి రూ. 12,000 అందిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని నిరంజన్ రెడ్డి ధ్వజమెత్తారు. “పంటలు కోతలకు వస్తుంటే, ఇప్పుడు నాట్లు పూర్తయ్యాక రైతు భరోసా వేస్తామని చెప్పడం రైతులను వెక్కిరించడమే” అని ఆయన అన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఓట్ల కోసం మళ్లీ అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

రాష్ట్రంలో యూరియా కోసం రైతులు అల్లాడుతుంటే ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్లు కూడా లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులతో చెలగాటం ఆడుతున్న ఈ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

కేసీఆర్ మేడారం వెళ్లలేదని కాంగ్రెస్ నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, ఒకవేళ ఆయన వెళ్లకపోతే ప్రజలకు అందాల్సిన పథకాలను ఆపేస్తారా? అని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. మేడారం జాతర కోసం రూ. 250 కోట్లు ఖర్చు చేశామని చెబుతున్నారని, కానీ నెల తిరగకముందే గద్దెల వద్ద రాళ్లు కూలిపోతుండటం ఈ ప్రభుత్వ అవినీతికి నిదర్శనమన్నారు. కనీస సౌకర్యాలు లేక భక్తులు మంత్రుల వాహనాల అద్దాలు పగులగొట్టారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రజల తీర్పుకు భయపడే కాంగ్రెస్ అబద్ధాలతో పక్కదారి పట్టిస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here